పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెలల తరబడి వాయిదా పడిన తర్వాత అసలు మొత్తానికే ఆగిపోయింది అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే గత ఏడాది చివర్లో దర్శకుడు సముద్రఖని ఈ ప్రాజెక్టును ఖరారు చేశారు.ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మను హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన రొమాంటిక్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ హీరోయిన్ యువతకు హాట్ ఫేవరెట్ అయ్యారు. కాగా కేతికా నటించిన గత సినిమాలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరో కావడం విశేషం.
కేతికా శర్మ చివరగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ, హీరోయిన్ కు మాత్రం ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. అందువల్ల పలువురు దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో ఆమెను నటింపజేయడానికి ఆసక్తి చూపడంతో తన పాపులారిటీ గణనీయంగా పెరిగింది.
సముద్రఖని తమిళంలో తెరకెక్కించిన ఫాంటసీ కామెడీ డ్రామా అయిన వినోదాయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచనలో భాగం కానున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన తమిళ చిత్రం వినోదాయ సీతం విడుదల సమయంలోనే పవన్ ఆ సినిమా పైన ఆసక్తి చూపించారట.
ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సముద్రఖని నటనకు మంచి ప్రశంసలు లభించడంతో పాటు పవర్ స్టార్ ను కూడా ఆకట్టుకుంది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత మరో 90 రోజులు బతకాలని కోరే ఒక అహంకార స్వభావం గల వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కింది. అతను తన జీవితాన్ని ఎలా మార్చుకుంటాడు మరియు అందరూ మరింత ఇష్టపడే వ్యక్తిగా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ. ఇందులో తంబి రామయ్యతో పాటు దేవుడు పాత్రలో సముద్రఖని ఒక కీలక పాత్రలో నటించారు.