రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా ప్రాంతీయ, అంతర్జాతీయ హద్దులు చెరిపేసి కీర్తీ ప్రతిష్ఠలను పొందింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించి ఈ సినిమాపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. చరణ్, తారక్ నటన.. రాజమౌళి దర్శకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం కొంత మిశ్రమ స్పందన తెలిపిన మాట వాస్తవమే.
తాజాగా మరోసారి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ఆర్ఆర్ఆర్ ఏకంగా గే లవ్ స్టోరీ అనేశాడు ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి. దీంతో అతని పై రామ్ చరణ్, ఎన్టీయార్ అభిమానులే కాక తెలుగు సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు.నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే 30 నిమిషాల చెత్త సినిమాను చూశాను అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతనికి ట్వీట్ కు బదులిస్తూ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ గే లవ్ స్టోరీ అంటూ కామెంట్ చేశారు. దీంతో రసూల్ తీరుపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఒక ఆస్కార్ విజేత నుంచి ఇలాంటి నీచమైన ఆలోచన, ప్రవర్తన చూసి ఒక్కసారిగా సదరు ట్వీట్ పై భారీ తరహాలో నిరసన తెలిపారు.
ఇదిలా ఉండగా పూకుట్టి ట్వీట్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అసహనం వ్యక్తం చేశారు.“మీరు చెప్పినట్లుగానే ఆర్ఆర్ఆర్ సినిమా గే లవ్ స్టోరీ అని నేను అనుకోను. అయితే అది గే లవ్ స్టోరీ అయితే తప్పేంటీ ? అది తప్పు విషయమా ? మీ మాటలను మీరు ఎలా సమర్ధించగలరు ? ఎన్నో విజయాలు అందుకున్న మీరు ఇలా తక్కువ స్థాయికి దిగజారి మాట్లాడటం మమ్మల్ని నిరాశకు గురిచేసింది ” అంటూ రిప్లై ఇచ్చారు.
దానికి బదులుగా రసూల్ తను చేసిన వ్యాఖ్యను కప్పి పుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు.”మీరన్నది నిజంగా యథార్థం. నిజంగా అది ఒక గే స్టోరీ అయినా అందులో ఏమీ తప్పులేదు.. నేను ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాన్ని మా స్నేహితుడికి చెప్పాలని ప్రయత్నించాను అంతకుమించి అందులో ఏమీ లేదు. నేను సినిమాని తప్పు పట్టడానికి గాని తక్కువ చేయడానికి కానీ ప్రయత్నించలేదు. శోభు మీరు దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను సినిమా గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడటం లేదు గతంలో ఒక న్యూస్ కథనాన్ని నేను ప్రస్తావించాను తప్ప ఇందులో నా ఉద్దేశం ఏమీ లేదు”అంటూ ఆయన నామమాత్రపు వివరణ ఇచ్చారు.
అయితే ఈ వివాదం ఇంతటితో ఆగలేదు.. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ విషయమై ఘాటుగా స్పందించారు. శోభు ట్వీట్ కు బదులు ఇస్తూ కీరవాణి “బహుశా నాకు ఇంగ్లీష్ లో అప్పర్ కేస్ (upper case), లోయర్ కేస్(lower case) వాడటం సరిగా రాదేమో,కానీ నేను ప్రతి ఒక్కరి వాక్ స్వాతంత్రాన్ని గౌరవిస్తాను..రసూల్ పూకుట్టి అభిప్రాయంతో సహా” అంటూ రసూల్ పేరులో ద్వంద్వార్థం ద్వనించేలా ఆయన బదులు ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన సినిమాని మన భారతీయులే ఇలా కించపరచడం బాగొలేదంటూ పలువురు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్న తరుణంలో కీరవాణి ద్వంద్వార్థపు కౌంటర్ తో విషయం మరింత వేడెక్కింది.మరి ఈ మొత్తం వ్యవహారం పై రసూల్ ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.