టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి టైటిల్ పెట్టని ఈ సినిమాని SSMB29 అనే పేరుతో పిలుస్తున్నారు. మహేష్ బాబుతో చేయబోయే ఈ సినిమా ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ గా ఉంటుందని రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.
ఇప్పటికే ఈ సినిమాకి భారీ స్థాయిలో హైప్ ఏర్పడగా.. తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి తన వ్యాఖ్యలతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటకు గానూ ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు కీరవాణి SSMB29 బ్యాక్ డ్రాప్ ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉంటుందని చెప్పారు. ఈ వీడియో ఇప్పటికే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో చక్కర్లు కొడుతోంది. కీరవాణి చెప్పిన ఈ మాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిస్సందేహంగా ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలో ఒక భారీ సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు.
బాహుబలి సినిమాతో దేశం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో అయితే ప్రపంచ వ్యాప్తంగా అందరూ అవాక్కయ్యేలా చేశారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఈ యాక్షన్ ఎపిక్ ను చూసి అబ్బురపడుతోంది. ఇలా తను తీసే ప్రతి సినిమాతో ఈ మాస్టర్ కథకుడు అంచనాలను పెంచుకుంటూ వెళ్తారు కాబట్టి ఆయన తదుపరి చిత్రం పై భారీ అంచనాలు ఉండటం సహజమే.