తనదైన కథలు, సినిమాలు ఎంపిక చూసుకుని ఎప్పుడు ఎదో కొత్త తరహా ప్రయత్నాలు చేసే యువ హీరో నిఖిల్ నటించిన మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ `కార్తికేయ 2`. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఒక కీలక అతిథి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. ముందుగా జూలై 22న విడుదల కావాల్సిన ఈ సినిమాకి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. జూలై 22న విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించినా.. అదే సమయంలో నాగచైతన్య `థాంక్యూ` సినిమా కోసం కార్తీకేయ 2 వాయిదా వేసుకోమన్నారట.
అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు చెప్పడంతో `కార్తికేయ 2`విడుదల తేదీని ఆగస్టు 12కు మార్చటం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే `కార్తికేయ 2` ని వాయిదా వేయించి జూలై 22న విడుదలైన `థాంక్యూ` చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం చవి చూసింది.
ఇక ఎట్టకేలకు `కార్తికేయ 2`ని ఆగస్టు 12న విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు మొదలు పెడితే.. ఆ డేట్ కు కూడా విడుదల చేయకూడదని కొంత మంది వెనక్కి వెళ్లమన్నారని లోగడ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆగస్టు 12న మా సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతుందని హీరో నిఖిల్ స్పష్టం చేసినా.. చివరి నిమిషంలో రిలీజ్ డేట్ ని మళ్లీ మార్చుకోవాల్సి వచ్చింది.
ఆగస్టు 12న నితిన్ `మాచర్ల నియోజక వర్గం` రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రెండు సినిమాల మధ్య క్లాష్ ఉండటం మంచిది కాదని మళ్లీ నిఖిల్ `కార్తికేయ 2`ని వెనక్కి వెళ్లమన్నారట. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ఒక రోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న కార్తీకేయ 2 సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఆగస్టు 12న విడుదలైన నితిన్ `మాచర్ల నియోజక వర్గం` నిరాశపరచడంతో 13న రానున్న నిఖిల్ సినిమాపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్తీకేయ 2 ఎట్టకేలకు ఈరోజు విడుదల అయింది. ఓవర్సీస్ షోల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఓవర్సీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పటికే మంచి బజ్ ఉన్న ఈ సినిమాకి టాక్ కూడా తోడైతే బ్లాక్ బస్టర్ అవడం చాలా సులువు. మరి తొలి రోజు ప్రీమియర్ల నుంచి వినిపిస్తున్న టాక్ నిజమై కార్తీకేయ 2 ఘన విజయం సాధించి తెలుగు సినిమా పరిశ్రమకు మరో భారీ విజయాన్ని అందివ్వాలని కోరుకుందాం.