యువ హీరో నిఖిల్ మరియు చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ (2014) చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. ఈ శనివారం అంటే ఆగస్ట్ 13న ఈ చిత్రం విడుదల అయింది. ఇక ప్రేక్షకులు కార్తికేయ -2 సినిమాకి ఏకంగా బ్రహ్మరథం పట్టారు అని చెప్పవచ్చు. ఓవర్సీస్, నార్త్ ఇండియా, ఆంధ్రా, తెలంగాణ ఇలా అన్ని చోట్ల నుండి ఈ సినిమా అద్భుతమైన స్పందనను రాబట్టుకుని ఘనవిజయం సాధించే దిశగా దూసుకు పోతుంది. ఈ సంధర్బంగా కార్తికేయ- 2 చిత్ర బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించారు.
ఆ క్రమంలో చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడారు. దర్శకుడు చందు మొండేటి తనకు కథ చెప్పిన దానికంటే తెర పైన ఇంకా అద్భుతంగా సినిమాను తీశారని చెప్తూ, తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు చందూ మొండేటికు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సినిమాకి అని చోట్లా ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తుందని చెబుతూ.. కార్తికేయ 2 ఇతర సాంకేతిక నిపుణలకు కూడా అనుపమ పరమేశ్వరన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆ పైన దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. కరోనా పాండమిక్ తాలూకు రెండు వేవ్ లను, మరియు ఇతర అనుకోని సమస్యలను ఎదుర్కుని ఈ సినిమా విడుదల అయిందని చెప్పారు. ఈ సినిమా విజయం సాధించడంతో విడుదలకు ముందు పడ్డ కష్టాలన్నిటినీ మర్చిపోయామని అన్నారు. కాగా ఈ సినిమాకి వస్తున్న విశేషమైన స్పందన చూసి ఆయన ఎంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. చివరిగా ఈ సినిమా విజయం సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్తూ కార్తీకేయ 2 చిత్రానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు చందూ మొండేటి.
ఇక హీరో నిఖిల్ మాట్లాడుతూ… సినిమా విడుదలకు ముందు నుంచీ మద్దతుగా నిలిచినమీడియా వారికి థాంక్స్ చెప్పారు, అలాగే ఈ చిత్రానికి మొదటి షోలు పడిన యూఎస్ దగ్గర నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. తుది ఫలితం కోసం ఎదురు చూసినట్లు తెలిపారు. కాగా సినిమా షో పూర్తవగానే ఫోన్ కాల్స్ ద్వారా అభినందనలు వచ్చాయని చెప్పారు.అన్నీ ఏరియాలలో కూడా కార్తీకేయ 2 హౌస్ ఫుల్ లను నమోదు చేసినట్లు తెలియగానే ఎంతో సంతోషించామని. తమ సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నట్లు కూడా నిఖిల్ తెలిపారు. రేపు ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయని. ఇది ఇలానే కొనసాగుతుంది అని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక చందూ మొండేటి చక్కని కథను రాసుకోవడమే కాకుండా దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారని చెబుతూ.. కార్తికేయ 2 చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, కార్తికేయ-2 చిత్ర ఘన విజయం ఇటీవలే స్వర్గస్తులైన ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ సినిమా మంచి ఆదరణ పొందుతోందని తెలిపారు.