కన్నడ నటుడు – దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతీహత ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన ఐదు వారాల తర్వాత కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. భారతీయ సినిమా ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్‌ను కొనసాగిస్తోంది. ఓవరాల్ గా 300 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి మరో మైలురాయిని సాధించింది కాంతార.
ఈ చిత్రం హిందీ మరియు తెలుగు రెండు వెర్షన్ల నుండి 50 కోట్లకు పైగా వసూలు చేసింది. కేరళలో ఈ సినిమా 11.5 కోట్లు, కర్ణాటకలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో ఈ సినిమా 3.5 మిలియన్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా వరల్డ్‌వైడ్ గ్రాస్ ఇప్పుడు 305 కోట్లకు చేరువలో ఉంది మరియు ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ఫుల్ రన్‌లో 350 కోట్లను సులభంగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేయబడింది.
భారీ సెట్టింగులు, సూపర్ స్టార్లు, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ ఉన్న సినిమాలు మాత్రమే మంచి ఆదరణకు నోచుకుంటుంది అనే అపోహ ప్రస్తుతం చాలా మందిలో ఉండగా.. కాంతార వాటన్నింటినీ తప్పని నిరూపించింది. అగ్ర తారాగణం లేకుండా తీసిన ఈ సినిమా పెద్ద సినిమాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి దర్శక నిర్మాతలకు కొత్త పాఠాలు చెబుతోంది.
భారీ బడ్జెట్ చిత్రాలే జనాలను థియేటర్లకు రప్పిస్తాయన్న అపోహను తొలగించి కొత్త చర్చకు తెరలేపుతోంది కాంతార. ఈ సినిమా అనూహ్య విజయం పలు పరిశ్రమలకు పెద్ద గుణపాఠంగా మారడంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ “కాంతార` చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో ఏ సినిమాను మెచ్చుకోని సెలబ్రిటీలంతా ‘కాంతార’ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయి ప్రదర్శనతో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా పై ట్రేడ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
స్వచ్ఛమైన కన్నడ నేటివిటీతో రూపొందిన ఈ సినిమా నిజమైన ప్రాంతాలకు అతీతంగా కంటెంట్ ఉన్న సినిమా అందరికీ నచ్చుతుందని చూపిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది.