రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతార దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ వారం ఇతర భాషల్లో డబ్బింగ్ అయినప్పటి నుండి, ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందుతుంది. అంతే కాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ముగుస్తుందో ఊహించడం కూడా ట్రేడ్ పండితులకు చాలా కష్టంగా మారింది.
రెండు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కన్నడ వెర్షన్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేస్తుంది. మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత క్రమక్రమంగా ఈ చిత్రం అసాధారణమైన స్పందనను పెంచుకుంటూ కలెక్షన్లలో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. ఇక సినీ ప్రియుల ప్రోత్సాహం వల్ల డబ్బింగ్ వెర్షన్‌లలో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.
నిన్న ఆదివారం రోజు కాంతార చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద రోజుగా నిలిచింది. ఈ చిత్రం అన్ని చోట్లా సంచలన ప్రదర్శన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.5 కోట్లకు పైగా గ్రాస్, హిందీలో 4 కోట్ల నెట్, తమిళనాడులో 1 కోటికి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక స్వస్థలమైన కర్ణాటకలో ఆదివారం రోజు భారీ నంబర్లను నమోదు చేసుకుంది.
మొత్తంగా చూసుకుంటే కాంతార చిత్రం ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 150 కోట్ల మార్కు వైపు దూసుకుపోతోంది.
ప్రేక్షకుల పై చూపిన విశేషమైన ప్రభావంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కాంతార ఒక్క విషయం మాత్రం రుజువు చేసింది. అదేంటంటే ఏ సినిమా అయినా సరైన కంటెంట్ యే ప్రధానం అని, హీరో ఎవరు, ఏ భాష అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని మళ్లీ నిరూపించిందీ చిత్రం.
కాంతార చిత్రం శనివారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది, ఇది మంచి లాంగ్ రన్‌ను కలిగి ఉంటుందని మరియు వచ్చే వారంలో విడుదలయ్యే సినిమాలను ప్రభావితం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. మరి వచ్చే వారాంతంలో ఎవరి సినిమా ఎవరిని డామినేట్ చేస్తుందో వేచి చూద్దాం.