యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ అన్ని భాషల్లో మంచి విజయం అందుకుంది. ఇక దీని అనంతరం ప్రస్తుతం తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రెండు సినిమాలు తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు ప్రశాంత్.
ఆ రెండు సినిమాలతో పాటు తాజాగా హనుమాన్ కి సీక్వెల్ అయిన జై హనుమాన్ కి కూడా శ్రీకారం చుట్టారు. రేపు దీపావళి పండుగని పురస్కరించుకొని ఈ సినిమాలో కీలకమైన హనుమంతుని పాత్రధారిలో నటించే నటుడిని అనౌన్స్ చేశారు. కాగా ఆ పాత్రకు కాంతారా నటుడు మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ని ఎంపిక చేశారు.
కొద్దిసేపటి క్రితం జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్ లో హనుమంతుని పాత్రలో శ్రీరాముని విగ్రహం గుండెలకు హత్తుకుని ఉన్న రిషబ్ శెట్టి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కలిసి గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తున్న ఈ సినిమా 2026 లో పట్టాలెక్కి 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మోక్షజ్ఞతో మూవీ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ, అలానే మరోవైపు కాంతారా ది లెజెండ్ మూవీతో రిషబ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.