గత ఏడాది బింబిసార వంటి భారీ విజయం తర్వాత కళ్యాణ్ రామ్ తాజా చిత్రం అమిగోస్ పై అందరిలోనూ అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్స్, ప్రమోషనల్ కంటెంట్ చాలా యూనిక్ గా కనిపించిన ఈ సినిమా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ చిత్రం నిజానికి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ, మంచి కంటెంట్ వల్ల విడుదల అయిన తర్వాత మంచి టాక్ ను తెచ్చుకుంటుందని చాలా మంది ఆశించారు.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడంతో కళ్యాణ్ రామ్ కు వరుసగా రెండో హిట్ వస్తుందనే అంచనాలన్నీ అర్ధాంతరంగా ముగిశాయి. వరల్డ్ వైడ్ గా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. తొలి రోజు కేవలం 4 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందని, బయ్యర్లు 50 శాతానికి పైగా పెట్టుబడిని కోల్పోతారని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
అమిగోస్ సినిమా డోపెల్ గాంగర్స్ అనే ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ కు మంచి ప్రశంసలు పొందింది. కానీ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే మరియు మలుపులు లేకపోవడం వల్ల సినిమా ఉండాల్సినంత పకడ్బందీగా లేదనే టాక్ తెచ్చుకుంది. అందువల్ల ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది.
విడుదలకు ముందు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పేలవంగా ఉండడంతో సినిమా ఫస్ట్ టాక్ పైనే చాలా ఆధారపడింది. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న విధంగా సినిమాకు టాక్ రాలేదు. సరైన టాక్ లేకుంటే ఇలాంటి కొత్త తరహా సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కష్టమే.
నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ప్రేయసిగా ఆషికా రంగనాథ్ నటించారు. ఈ చిత్రానికి కోలీవుడ్ సంగీత దర్శకుడు జిబ్రాన్ స్వరాలు సమకుర్చారు.