ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ పెద్ద హీరోల సినిమాలతో పాటు యువ హీరో సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన కళ్యాణం కమనీయం సినిమా కూడా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించారు.
ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊహించినట్లుగానే యు సర్టిఫికేట్ పొందింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రన్ టైమ్ చాలా తక్కువగా ఉండటమే. కళ్యాణం కమనీయం కేవలం 106 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది, ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా ప్రేక్షకులు అలాంటి రన్ టైమ్ ఉన్న సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఎందుకంటే రెండు గంటల కన్నా తక్కువ నిడివి ఉన్న సినిమాని వారు ఓటీటీలో చూసేందుకే ఇష్టపడతారు. కానీ పండుగ సమయంలో విడుదల అవుతుండటం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ చిత్రానికి సహాయపడవచ్చు.
కళ్యాణం కమనీయం సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించడం అనేది చాలా కష్టమైన పనే. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, తునివు, వారిసు వంటి సినిమాల ద్వారా ఈ చిత్రం తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతుంది.
ఈ చిత్రంలో దేవి ప్రసాద్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి, సద్దాం ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా.. యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచింది.