నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత ‘118’తో విజయం సాధించారు. 2020 లో విడుదలైన ఈ థ్రిల్లర్ అనూహ్యంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక కళ్యాణ్ రామ్ తదుపరి చేస్తున్న సినిమా ‘బింబిసార’. ఈ సినిమాకు మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్,టీజర్ లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అయితే తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది.
ఇక ట్రైలర్ ఎలా ఉందంటే…
త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారునిగా కొత్త లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఆశ్చర్యపరిచారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కించినట్టు యాక్షన్ సన్నివేశాలు చూస్తే తెలుస్తుంది. అలాగే సంభాషణలు కూడా ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి. ఇక రాజా ది గ్రేట్ లో విలన్ గా చేసిన వివాన్ ఈ చిత్రంలోనూ విలన్ గా కనిపిస్తుండగా, అయ్యప్ప శర్మ ముఖ్య పాత్రలో చేస్తున్నారు.టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వర్తమానానికి ..బింబిసారుడి కథకు ఎలాంటి లంకె కుదురుస్తారో చూడాలి.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ థెరీసా, సంయుక్త మీనన్ హీరోయిన్లు గాకనిపించనున్నారు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా ఫాంటసీ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని నందమూరి అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.ఎన్‌టీఆర్ అర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.