కళ్యాణ్ రామ్ హీరోగా .. ఆయన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ‘బింబిసార’ సినిమా రూపొందింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.
ఆ ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో హీరో కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ పాయింట్ ను టచ్ చేశామని, ఒక వేళ నిజ జీవితంలో కూడా అలా టైమ్ ట్రావెల్ చేసే అవకాశం వస్తే, ఆయన తాతగారైన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాలానికి వెళ్లి ఆయన సినిమా షూటింగులు వాటి విశేషాలు చూస్తానని కళ్యాణ్ రామ్ అన్నారు.
ఇక ఈ శుక్రవారం అంటే ఆగస్ట్ 5న విడుదల అవుతున్న బింబిసార సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే, 18 తారీఖున ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ చిత్రానికి సంగీతం అందించాలని ముందుగా కీరవాణిని అనుకున్నారట, అయితే ఆయన ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉండటం వలన పాటలు కాకుండా నేపథ్య సంగీతం మాత్రం ఆయన చేత చేయించామని కళ్యాణ్ రామ్ తెలిపారు.
అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుంది అని, అందులో ఎన్టీఆర్ కూడా భాగం అవుతారని ఇటీవలే కొన్ని పుకార్లు వినిపించాయి. వాటి గురించి కూడా కళ్యాణ్ రామ్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ కు బింబిసార చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, అయితే ఈ సినిమాకి సీక్వెల్ మరియు హాలీవుడ్ మాదిరిగా మల్టీవర్స్ గా కూడా మలిచే ఆలోచన కూడా ఉందని, అయితే అవన్నీ రూపు దాల్చాలి అంటే ముందు బింబిసార విడుదలై మంచి విజయం సాధించాలని.. ఆ తరువాతే మిగతా విషయాలు ఆలోచిస్తామని కళ్యాణ్ రామ్ అన్నారు.
మరి టైమ్ ట్రావెల్ లాంటి ఆసక్తికరమైన కథాంశంతో చక్కని అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదల కానున్న బింబిసార చిత్రం అందరి అంచనాలు అందుకుని భారీ విజయం సాధించి అటు నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా అలరించాలని కోరుకుందాం.