కెరీర్ తొలి నాళ్ళ నుండి జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటారు నందమూరి కళ్యాణ్ రామ్. నటుడిగా వైవిద్యం చూపించడానికి ఇష్టపడే ఆయన ఎప్పుడూ ప్రయోగం చేయాలనుకోవడమే కాకుండా తానే నిర్మాతగా మారి ఆ బాధ్యతను మోస్తుంటారు. అలా నిర్మాతగా రిస్క్ చేసి పలుసార్లు చేతులు కాల్చుకున్నా కూడా ఎప్పుడు కూడా ప్రయోగాలకు వెనుకాడలేదు కల్యాణ్ రామ్.తాజాగా ‘బింబిసార’తో మరో పెద్ద సాహసం చేస్తున్నారు.
కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ దర్శకుడు. ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై చక్కని స్పందనను రాబట్టుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ సినిమా రిజల్ట్ పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
‘బింబిసార’ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంత భారీ బడ్జెట్ ను కేవలం సినిమాపై నమ్మకంతో తన బావమరిదితో కలిసి కళ్యాణ్ రామే సొంతంగా నిర్మించి రిస్క్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ బిజినెస్ దాదాపు 18 కోట్లకు జరిగింది అని సమాచారం. ఈ వివరాలు నిజమే అయితే కళ్యాణ్ రామ్ సేఫ్ అవ్వాలంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి మరో రూ.32 కోట్లు రావాలి. ప్రస్తుతం ఓటీటీ బిజినెస్ లో లాభసాటి వ్యాపారం జరిగే అవకాశం ఎక్కువగా ఉండటం కళ్యాణ్ రామ్ కు కాస్త ఊరటనిచ్చే విషయం.
బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి ప్రస్తుతం చాలా జాగ్రత్తగా తను పని చేసే సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి కీరవాణి ఈ సినిమాకి నేపథ్య సంగీతం అద్భుతంగా అందించారట. ఇక సినిమా అవుట్ పుట్ చూసుకొని కళ్యాణ్ రామ్ తో పాటు చిత్ర యూనిట్.. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమని నమ్మకంగా ఉన్నారట.