2022లో సర్ ప్రైజ్ హిట్ గా నిలిచిన చిత్రం బింబిసార. ఈ చిత్రం ప్రేక్షకులను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించగలిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి భాగం ఘనవిజయం తర్వాత ఇప్పుడు బింబిసార సీక్వెల్ గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.
కాగా హీరో కళ్యాణ్ రామ్, దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఇద్దరూ ఈ సినిమాను రెండు మూడు భాగాలుగా విడుదల చేయాలని ముందే అనుకున్నారు. తాజాగా ఈ విషయం పై కళ్యాణ్ రామ్ మాట్లాడారు.
తన తాజా చిత్రం అమిగోస్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్.. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బింబిసార సీక్వెల్ ప్లాన్స్ గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ డెవిల్ లో నటిస్తున్నానని, ఆ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తయిందని వెల్లడించారు. ఇక దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ ఏడాది చివరి నాటికి బింబిసార సీక్వెల్ పనులు ప్రారంభిస్తారని కూడా ఆయన తెలిపారు.
క్రీస్తుపూర్వం 500 నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం తన రాజ్యంలో ఎటువంటి అసమ్మతి రగిలినా దాన్ని అణచివేసేందుకు తీవ్రమైన చర్యలు తీసుకునే ఒక క్రూరమైన మరియు అధికార దాహం ఉన్న రాజు అయిన బింబిసార (కళ్యాణ్ రామ్) కథను అనుసరిస్తుంది.
ఈ ఫాంటసీ డ్రామా మొదటి రోజు నుండి పాజిటివ్ రివ్యూలు మరియు థియేటర్ల వద్ద అద్భుతమైన ఆక్యుపెన్సీలతో విడుదలైంది. అలాగే సినిమాతో సంబంధం ఉన్న వారందరికీ అద్భుతమైన లాభాలను అందించింది. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వివాన్ భటేనా కీలక పాత్రల్లో నటించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆయన తన అనుభవాన్ని అంతా రంగరించి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకి చాలా బాగా ఉపయోగపడింది. ఇక ఆయన స్వరపరిచిన నీతో ఉంటే చాలు పాట సినిమాకి ప్రాణంలా నిలిచింది.