కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో మరియు బాక్సాపీస్ వద్ద ట్రేడ్ వర్గాల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు మరోసారి ఇండియన్ 2 సినిమాతో కలిసి పని చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా షూటింగ్ మొదలై మధ్యలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి మరో అప్‌డేట్ తెర పైకి వచ్చింది.
తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చాలా కాలం ఒక వెలుగు వెలిగిన చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతానికి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తల్లిగా ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త బాధ్యతను నిర్వర్తించే పనిలో ఉన్నారు. కాజల్ పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోగా . ఇండియన్ 2 సినిమాలో ఆమె చాలా కాలం క్రితమే భాగం అయిన విషయం తెలిసిందే. ఆమె పై గతంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు కూడా. అయితే రకరకాల కారణాల వల్ల ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతే కాకుండా ఆ సినిమాను మొత్తంగా క్యాన్సిల్ చేసారని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల జరిగిన కొన్ని చర్చల ద్వారా నిర్మాణ సంస్థకు మరియు దర్శకుడు శంకర్ కు మధ్య రాజీ కుదరడంతో తిరిగి ఇండియన్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇండియన్ 2 సినిమాలో కాజల్ బదులు ఆ పాత్ర కోసం దీపిక పదుకునె మరియు కత్రీనా కైఫ్ లతో చర్చలు జరిగాయని.. వారిలో కమల్ హాసన్ కు జోడీగా ఎవరు అయితే బాగుంటారు అనే విషయమై సంప్రదింపులు కూడా జరిగాయని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లన్నిటికీ కాజల్ తన ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చారు. ఈరోజు అభిమానులతో జరిగిన లైవ్ సేషన్ లో తాను ఇండియన్ 2 నుంచి తొలగించ బడలేదని ధృవీకరించారు. సెప్టెంబర్ 13నుంచి ఇండియన్ 2 షూటింగ్లో తిరిగి పాల్గొనబోతున్నట్లు కాజల్ తెలిపారు.
70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండియన్ 2 మిగిలిన షూటింగ్ ను ఈ కొత్త షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో కాజల్ అగర్వాల్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఇండియన్ 2 కోసం తాత్కాలికంగా ఆ సినిమా షూటింగ్ ను నిలిపివేసి.. ముందు ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేశాక మళ్ళీ రామ్ చరణ్ సినిమాను తిరిగి ప్రారంభిస్తారట.