లైగర్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దారుణమైన ప్రదర్శన పరిశ్రమ వర్గాలలో చర్చలకు దారి తీసింది. ఇటీవలే బింబిసార, సీతా రామం మరియు కార్తికేయ 2 వంటి చిన్న సినిమాలు అద్భుతంగా ప్రదర్శించి బ్లాక్‌బస్టర్ వసూళ్లు రాబట్టిన సమయంలో లైగర్ విడుదలైంది. భారీ ప్రచారం జరుపుకుని ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితంతో పబ్లిసిటీ కంటే కంటెంట్ ఏ గొప్పదని మరోసారి రుజువైంది. అదే సమయంలో, దర్శకుడు పూరీ జగన్నాధ్ మరియు హీరో విజయ్ దేవరకొండ పరిస్థితిని చక్కదిద్దే పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఎలాగైనా సరే లైగర్ వల్ల నష్టపోయిన కొనుగోలుదారులకు పరిహారం చెల్లించాలని ఆలోచనలో ఉన్నారట.
లైగర్ సినిమా చిత్రీకరణ సమయంలోనే పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన అనే చిత్రాన్ని ప్రకటించారు. కాగా ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద లైగర్ దారుణమైన పరాజయం పాలైన దశలో.. ఆ సినిమాను కొన్న బయ్యర్లకు నష్టపరిహారం ఇవ్వడానికి జన గణ మన సినిమాని వీలయినంత తక్కువ బడ్జెట్‌లో తీయడంతో పాటు.. పూరి, విజయ్ లు రెమ్యునరేషన్ లేకుండా జన గణ మన సినిమాని తెరకెక్కించి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
దాంతో ముందుగా అనుకున్న స్క్రిప్ట్ ను మార్చుకుని మళ్ళీ కొత్తగా స్క్రిప్ట్ రాసుకునే పనిలో పూరి ఉన్నారట. బడ్జెట్ తగ్గించేందుకు కావాల్సిన అన్ని మార్పులు చేసి, కేవలం బలమైన కథ పై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. తాజా వార్తల ప్రకారం, లైగర్ సినిమా లాగా కాకుండా కథ, కథనాల పైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని సమాచారం. కాగా ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. మరి పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ జోడీ ఈసారి అద్భుతమైన తీసి అందరి చేతా ప్రశంసలు అందుకునే స్థాయిలో విజయాన్ని అందుకుంటారాని ఆశిద్దాం.
జనగణమన సినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ నటించనుందని కూడా ప్రకటించారు. కాగా ఈ సినిమాను పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఛార్మి కౌర్, దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో 2023 ఆగస్టు 3న ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయాలని ముందుగా పూరి అండ్ టీమ్ అనుకున్నారు. మరి ఇప్పుడు అదే తేదీకి విడులవుతుందా లేదా చూడాలి.