పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు జల్సా సినిమా స్పెషల్ షోలకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సందర్బంగా తమ అభిమాన హీరో పుట్టిన రోజును అంగ రంగ వైభవంగా జరుపుకోవడానికి పవన్ అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. అలాగే జల్సా సినిమా ఏ ఏరియాలో ఎన్ని షోలు ప్రదర్శిస్తున్నారో అవన్నీ కనుక్కుని అందరికీ సమాచారం అందజేస్తూ బిజీగా ఉన్నారు.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తగా పాత హిట్ సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించి మహేష్ అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు జరుపుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒకప్పటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఘరానా మొగుడు చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు నాడు మెగా అభిమానులు పోకిరి అంత భారీ స్థాయిలో లేకున్నా కొన్ని షోలు వేసుకుని ప్రదర్శించుకున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల వంతు వచ్చింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏ, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో కూడా జల్సా స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. అంతే కాదు స్పెషల్ షో వేస్తున్న చాలా ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు నమోదు అవుతున్నాయి అన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా ఇంకో ఆసక్తికర విషయమేంటంటే పవన్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తమ్ముడు చిత్రానికి కూడా ఆగస్టు 31న ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. అయితే తమ్ముడు చిత్రాన్ని జల్సా అంత భారీ స్థాయిలో కాకుండా కొన్ని షోలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు.
ఇక జల్సా స్పెషల్ షోలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దాదాపు 500 షోలకు పైగానే ప్రదర్శింపబడనుందని అంటున్నారు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి, అలానే అన్ని షోలకూ టిక్కెట్ల డిమాండ్ కూడా చాలా ఉంది. పోకిరి స్పెషల్ షోల రికార్డులన్నీ చెరిపేసే చేసే దిశగా జల్సా హవా నడుస్తోంది. సెప్టెంబర్ 1న ఈ స్పెషల్ షోలు వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
మొత్తానికి పవన్ అభిమానులు భారీ తరహాలో తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు ముందస్తుగా జరుపుకునేందుకు జల్సా చిత్రం కేంద్రంగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు.
కాగా ఈ చిత్రంలో ఇలియానా, కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించారు. ముఖేశ్ రిషి విలన్‌గా నటించగా.., ప్రకాశ్ రాజ్, అలీ, తనికెళ్ల భరణి,శివాజీ ఇతర పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించిన జల్సా సినిమా ఆ సమయానికి బాక్స్ ఆఫీస్ వద్ద టాప్-2 చిత్రంగా నిలిచింది.