పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఒక శుభ వార్త పలకరించనుంది. వారు ఎంతో ఆశగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు వారికి ఎంతో ఇష్టమైన బహుమతి సిద్ధం అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 షోలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “జల్సా” చిత్రం ఆయన పుట్టిన రోజున థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు గతంలో సాధించిన బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్ళీ విడుదల చేసే కొత్త ట్రెండ్ మొదలైంది.. ఇటీవలే మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా.. మహేష్ అభిమానులు అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసి అంతే సమర్థవంతంగా అమలు చేసి పోకిరి చిత్రాన్ని మళ్ళీ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోకిరి సినిమా దాదాపు 400 షోలలో ప్రదర్శింపబడటం విశేషం.
2006 లో విడుదలై అప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో ఉన్న రికార్డులన్నిటినీ చెరిపేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాకు వేసిన ప్రత్యేక షోలకు మహేష్ అభిమానులు ఎగబడ్డారు. థియేటర్లో ఒక్కో సన్నివేశం, ఒక్కో డైలాగ్ ను భారీ ఎత్తున సంబరాలు జరుపుకుని ఒక పూనకం వచ్చిన తరహాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు మహేష్ అభిమానులు.
ఈ క్రమంలో మహేష్ అభిమానులకు ధీటుగా నిలవాలనే ఉద్దేశ్యంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తమ హీరో నటించిన జల్సా సినిమాను ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు సినిమా ప్రింట్ ను రిమాస్టర్ చేసి ఇవ్వాలని సోషల్ మీడియాలో ట్రెండ్ ను నిర్వహించారు.
ఆ రకంగా కొత్తగా మొదలైన స్పెషల్ షోల పద్ధతిని కొనసాగిస్తూ పవన్ అభిమానులు జల్సా సినిమాను 4 కె ప్రింట్ లో రిలీజ్ చేయాలంటూ ఆ చిత్ర నిర్మాతలని కోరారు. చిత్ర నిర్మాతలు సైతం అందుకు ఒప్పుకుని అభిమానుల కోరికను తీర్చెందుకు అన్ని ఏర్పాట్లు చేశారట.
ఇక పోకిరి కంటే జల్సాకు ఎక్కువ షోస్ వేయాలనే ఉద్దేశ్యంతో పవన్ అభిమానులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. పోకిరి సినిమాకి 400 షోలు పడగా జల్సా సినిమాను దాదాపు 500 షోలు వేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ అభిమానులు అనుకున్నది సాధిస్తారా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకూ ఆగాల్సిందే.
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా జల్సా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఆ సమయంలో తన స్థాయికి తగ్గ హిట్ లేని పవన్ కు ఈ సినిమాతో సూపర్ హిట్ లభించింది. అంతే కాకుండా ఆ పై త్రివిక్రమ్ తో కలిసి మరిన్ని సినిమాలకు పని చేసి వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిన విషయం తెలిసిందే.