జబర్దస్త్ సుధీర్ హీరోగా నటించగా అద్భుతమైన కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను అబ్బురపరిచి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన గాలోడు సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఓటీటీ హక్కుల ద్వారా కూడా మంచి మొత్తాన్ని రాబట్టిన ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహా వీడియో మరియు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన ‘గాలోడు’ లో బడ్జెట్ సినిమాలలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సినిమాగా నిలిచింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ పైన చెప్పినట్టు గాలోడు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ చిత్రంతో హీరోగా సుధీర్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని, స్టార్ గా ఎదగగలనని నిరూపించడంతో పాటు ఆయనకు ఉన్న బలమైన ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగిందని నిరూపించారు. నిజానికి ఆయన బాక్సాఫీస్ పుల్ గురించి అందరూ చాలా తక్కువ అంచనా వేశారు కానీ ఆయన గాలోడుతో అందరి అనుమానాలనూ పటా పంచలు చేశారు.
తెలుగు చిత్రపరిశ్రమలో సినిమాలు సరిగ్గా నడవని సమయంలో ఈ సినిమా విడుదలైనా మంచి వసూళ్లను రాబట్టింది. నిజానికి యశోద వంటి గట్టి ప్రత్యర్థులకు సవాలు కూడా విసిరి క్లీన్ హిట్ గా నిలిచిందీ గాలోడు.
జీవితంలో నిరాడంబరంగా ఉండే ఒక సరదా కుర్రాడి కథే ‘గాలోడు’. ఐతే అనుకోకుండా ఆ హీరో ఒక శక్తివంతమైన వ్యక్తిని చంపి తన గ్రామం నుండి పారిపోవాల్సి వస్తుంది, ఇక ఆ క్రమంలో అతనికి నచ్చిన అమ్మాయి కూడా దొరుకుతుంది. అతను అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది మరియు తన సమస్యను ఎలా పరిష్కరిస్తాడు అనేది మిగతా కథ.
ప్రేక్షకులను మెప్పించే అన్ని మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సుధీర్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో పాటు మాస్ సాంగ్స్ కూడా సినిమాకి లాభాలు తెచ్చిపెట్టాయి. గాలోడు సినిమా ఆయన కెరీర్ కు పెద్ద బూస్ట్ గా నిలవడంతో పాటు ఓటీటీ రిలీజ్ లో కూడా మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.