ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన సినిమా పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ ముందురోజు అనగా డిసెంబర్ 4 న పలు ప్రాంతాల్లో ప్రదర్శితం అయ్యాయి. అయితే అందులో భాగంగా డిసెంబర్ 4 రాత్రి 9.30కి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ప్రత్యేకంగా తన ఫామిలీతో కలిసి పుష్ప 2 చూసారు అల్లు అర్జున్. అయితే ఆయన రాకతో ఒక్కసారిగా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది.
ఆ సమయంలో ఒక మహిళా మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దానితో సంధ్య థియేటర్ పై అలానే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఇక నేడు ఆయనని అరెస్ట్ చేయగా అతడికి 14 రోజుల రిమండ్ ని విధించింది కోర్టు. అయితే దానిపై తెలంగాణ హై కోర్ట్ లో కొద్దిసేపటి క్రితం వాదనలు ప్రారంభించారు ఆయన తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి.
ఫైనల్ గా గంటన్నరకు పైగా జరిగిన వాద ప్రతివాదాల అనంతరం అల్లు అర్జున్ కి తెలంగాణ హై కోర్ట్ మధ్యంతర బెయిల్ అయితే ప్రకటించింది. కాగా జైలు సూపరెంటెండెంట్ కి పూచికత్తు సమర్పించాలని, అలానే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్ట్ ని ఆశ్రయించాలని సూచించింది. మొత్తంగా తమ నటుడికి బెయిల్ దక్కడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.