ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అద్భుత నటులలో శర్వానంద్ ఒకరు. చిన్న పాత్రలతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టి తరువాత ప్రధాన పాత్రల వరకూ ఎదిగి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. కేవలం హీరోగా సాప్ట్ లేదా రొటీన్ లవ్ స్టోరీలు కాకుండా వెన్నెల సినిమాలో విలన్ రోల్.. అలాగే అమ్మ చెప్పింది చిత్రంలో మానసిక ఎదుగుదల పెరగని కుర్రాడి పాత్ర పోషించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు.
అయితే 2017 లో వచ్చిన ‘ మహానుభావుడు’ చిత్రం తరువాత శర్వానంద్ కు సరైన విజయం లభించలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో, శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించినపడి పడి లెచే మనసు చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు లభించినా ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అనిపించుకోవడంలో విఫలం అయింది. అలాగే సుధీర్ వర్మ తో చేసిన రణరంగం కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక కరోనా వెవ్ ల మధ్య విడుదలైన శ్రీకారం చిత్రం కంటెంట్ పరంగా పరవాలేదు అనిపించుకున్నా, ఆ చిత్రం కూడా కలెక్షన్ల వర్షం కురిపించ లేకపోయింది. గత ఏడాది దసరాకి విడుదలైన మహా సముద్రం హోదా ఘోరంగా పరాజయం పొందింది.
కాస్త గ్యాప్ తరువాత శర్వానంద్ హీరోగా ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలకమైన పాత్రలో కనుపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలను వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి పోషించారు. వచ్చే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ ఉండటంతో ప్రమోషన్స్ లో శర్వానంద్ పాలు పంచుకున్నారు.
ఆ కార్యక్రమాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ .. ‘జాను’ సినిమా సమయంలో జరిగిన ప్రమాదం వలన గ్యాప్ తీసుకోవడం వలన నేను లావు కావడం జరిగింది. వరుసగా ఎదురవుతున్న ఫ్లాపుల కారణంగా ఒక ఆరు నెలల గ్యాప్ తరువాత సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు.కాగా గతంలో నేను మాత్రమే కథలు వినేవాడిని. కానీ ఇప్పుడు నా స్నేహితులు లేదా ఇతర సన్నిహితులకు వినిపించిన తరువాత అన్ని రకాల అభిప్రాయాలు విని అప్పుడు సినిమా చేస్తున్నాను అని శర్వానంద్ చెప్పుకొచ్చారు. అలాగే తన సినిమాలు ఫ్లాప్ అయితే వేరే ఎవరినైనా నిందించటం లాంటి పనులు చేయనని, తన నిర్ణయం వల్లే జయాపజయాలు ఉంటాయని ఆయన అన్నారు.
ఇక ఆయన పారితోషికం పై వచ్చిన కొన్ని పుకార్లకు కూడా శర్వానంద్ స్పందించారు. ఈ మేరకు శర్వా మాట్లాడుతూ.. నా మార్కెట్‌ను బట్టి నేను నా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాను, నాకు మార్కెట్ లేకపోతే నిర్మాతలు నాకు ఎందుకు రెమ్యునరేషన్ ఇస్తారని శర్వానంద్ చెప్పారు. రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకపోతే డబ్బింగ్ చెప్పని హీరోలు చాలా మంది ఉన్నారు.. కానీ నేను మాత్రం నా పని మొత్తం పూర్తి చేసిన తర్వాత రెమ్యూనరేషన్ అడుగుతాను అని అన్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా తనకు ఇవ్వవలసిన పారితోషికంలో తేడా చేస్తే మటుకు ఎంత దూరం అయినా వెళ్తాను అని కూడా చెప్పారు. శర్వానంద్ చెప్పిన మాటల్లో తప్పు లేదు కదా. ఈ వివాదాలు ఏవీ లేకుండా ఆయన నటించిన తాజా చిత్రం “ఓకే ఒక జీవితం” చక్కని విజయం సాధించాలని కోరుకుందాం