ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. సినిమా టెకెట్ల ఆన్ లైన్ ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ వెబ్సైట్ కు సంభందించిన తదనంతర చర్యలన్నింటినీ ఆపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్ లో విక్రయించేందుకు వీలుగా 2021 డిసెంబర్ 15న తీసుకువచ్చిన సవరణ చట్టాన్ని, టికెట్ల విక్రయ ఫ్లాట్ ఫామ్ నిర్వహణను ఏపి స్టేట్, ఫిల్మ్ టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపిఎస్ఎఫ్‌టీవీటిడిసీ) అప్పగిస్తూ డిసెంబర్ 17న జారీ చేసిన జీవో ను సవాల్ చేస్తూ బుక్ మై షో సంస్థ, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ వేదిక ద్వారా మాత్రమే ప్రైవేటు సంస్థలను టికెట్ల ను విక్రయించాలని ఒత్తిడి చేయడంపై ప్రధానంగా అభ్యంతరం తెలిపారు.పిటిషనర్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, న్యాయవాదులు అశ్వనీకుమార్, సీవీ మోహన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ భాగస్వాములందరితో చర్చించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చిందనీ, ఈ దశలో మళ్ళీ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరారు.ఈ నెల 2వ తేదీ నుండి ఏపిలోని థియేటర్ లు అన్నీ ఆన్ లైన్ ద్వారానే టికెట్లు విక్రయించేలా ఒప్పందాలు చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే.
పిటిషన్ల పై ఇరుపక్షాల వాదనలు బుధవారం ముగిశాయి, ప్రధాన వ్యాజ్యాలపై జూలై 27న తుది విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సదరు జివోపై స్టే విధిస్తూ తదనంతర చర్యలు అన్నింటినీ ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.