హిట్ 2 (హిట్: ది సెకండ్ కేస్) విడుదలైనప్పటి నుండి సినిమా ప్రేమికుల్లో హిట్3 చిత్రం ఎక్కువగా చర్చించబడింది. కాప్ సిరీస్ లోని ఈ రెండవ భాగం దాని కంటెంట్ మరియు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లకు మంచి ప్రశంసలను కూడా పొంది అద్భుతమైన విజయం సాధించింది.
ఈ రోజుల్లో, ఫ్రాంఛైజీలు అనేవి కొత్త ఫార్ములాగా తయారు అవుతున్నాయి. ఒక సినిమా విజయం సాధిస్తే వరుస ఫ్రాంచైజీలు రావడం అనేది ఆనవాయితీగా మారుతోంది. ఫ్రాంచైజీగా తెరకెక్కిన సినిమాలు హిట్స్ గా ఎదుగుతుండటంతో హీరోలు ఈ తరహా ఫ్రాంఛైజీలను లైన్ లో పెడుతున్నారు.
అయితే ప్రతి ఫ్రాంచైజీ ఒకే హీరోతో పనిచేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ ‘. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇక హిట్2లో అడివి శేష్ కెడి (కృష్ణదేవ్) గా శక్తివంతమైన ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ చిత్రం పైన చెప్పిన విధంగా భారీ విజయాన్ని సాధించింది.
‘హిట్ 2’ విడుదలకు ముందే నేచురల్ స్టార్ నాని హీరోగా ‘హిట్ 3’ సినిమాలో నటిస్తారని వార్తలు వచ్చాయి. హిట్ 2 చివర్లో హీరో నాని క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇవ్వడం పై పలు చర్చలు జరిగాయి.
‘హిట్ 3’లో క్రూరమైన పోలీస్ గా నాని ఆకట్టుకోవడం కష్టమని చాలా మంది ప్రేక్షకులు భావించారు. ‘హిట్ 2’ చివర్లో నాని ఎంట్రీతో సినిమా డల్ అయిపోయిందని, కఠినమైన పాత్రలో నానిని ఎంటర్టైన్ చేయడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నాని సీరియస్ పాత్రలో నటించిన ‘వి’ సినిమాకు కూడా అలాంటి స్పందన లభించిందని కొందరు పేర్కొన్నారు. ముఖ్యంగా సీరియస్ పాత్రలో నాని నటనను జనం అంతగా అంగీకరించలేరని వారి వాదన.
అయితే, అన్ని చర్చలను పక్కన పెట్టి, హిట్ ఫ్రాంఛైజీ దర్శకుడు ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో హిట్ 3 లో ముగ్గురు ప్రధాన నటులు ఉంటారని తెలియజేశారు. విశ్వక్ సేన్, అడివి శేష్, నాని హిట్ 3లో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారట.
శైలేష్ ట్వీట్ ఇప్పుడు హిట్ 3 పై అంచనాలను పెంచింది. ఏదో పెద్ద ప్లానింగ్ లో ఉందని, ఈ చిత్రంలో భారీ బాణాసంచాలు పేలుతాయని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. యువ దర్శకుడు తన మాటలకు తగ్గట్టుగా సినిమా తీసి ఆకట్టుకోవాలని ఆశిద్దాం.