మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్.ఎల్ వీ సినిమాస్ ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘జైభీమ్’ ‘కర్ణన్’ సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రజీషా విజయన్ ‘మజిలీ’ షేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
ముఖ్యంగా ఇటీవలే విడుదలైన ఐటెం సాంగ్ “నా పేరు సీసా” సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన మోడల్/బాలివుడ్ నటి అయిన అన్వేషి జైన్ ఈ పాటలో తన గ్లామర్,స్టెప్స్ తో యూత్ కు పిచ్చెక్కించారు.ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 29న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. దానిలో భాగంగా ఇప్పటికే మూడు పాటలు మరియు టీజర్ ను విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి సంభందించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది.
అదేమిటంటే..దాదాపు 9 ఏళ్ల విరామం తరువాత ఈ సినిమాతో హీరో వేణు మళ్ళీ వెండితెరపై కనిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. అ చిత్రంలో వేణు సీఐ జమ్ము మురళి పాత్రలో నటిస్తున్నారు. పోలీస్ డ్రెస్ లో వేణు లుక్ భలే కొత్తగా ఉండి ఆకట్టుకునేలా ఉంది.
2013లో వచ్చిన ‘రామాచారి’ సినిమా తరువాత వేణు సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. సినిమాల గురించి అడిగితే చేయనని చెబుతూ వస్తున్నారట. అలా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న వేణు..ఢిల్లీ -హైదరాబాద్ లలో బిజినెస్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నారట. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో ముఖ్య పాత్ర కోసం అయనను సంప్రదించగా, ప్రస్తుతం నేను సినిమాలు చేయడం మానేశానన్నారట. అయితే పలుమార్లు అడిగిన తరువాత కథ వినడానికి ఒప్పుకున్నారట.
కథ విన్నాక చెప్పిన పాత్ర సినిమాలో ఎంత వరకు వుంటుందో, అలాగే ఎంత తీసేస్తారో చెప్పమన్నారట. అయితే శరత్ మండవ మాత్రం సింగిల్ కట్ కూడా వుండదని, చెప్పింది చెప్పినట్టుగానే సినిమాలో చూపిస్తామని మాట ఇచ్చారట. దాంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’తో హీరో వేణు మళ్లీ డ్యూటీ ఎక్కారట. ఇప్పటి దాకా ఎక్కువగా కామెడీ చిత్రాల్లో మాత్రమే నటించిన హీరో వేణు పాత్ర ఈ సినిమాలో సీరియస్ పాత్ర చేయబోతున్నట్లు లుక్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో హీరో వేణు మరిన్ని మంచి పాత్రలు, సినిమాలలో కనిపించాలని ఆశిద్దాం.