హీరో మంచు మనోజ్ పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది భూమా మౌనికా రెడ్డితో మనోజ్ వివాహం జరగాల్సి ఉందని అన్నారు. అయితే ఆ పుకార్ల పై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ మనోజ్ జనవరిలో ట్విటర్ వేదికగా తన జీవితానికి సంబంధించిన ప్రత్యేక వార్తను పంచుకుంటానని చెప్పగా, ఈ రోజు మంచు మనోజ్ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. భూమా నాగ మౌనిక ఫొటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా పెళ్లి కూతురు భూమా మౌనిక అని తెలియజేశారు.
శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని లక్ష్మీ మంచు ఇంట్లో పరిమిత సంఖ్యలోని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే. కొన్నాళ్ల నుంచి ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్లు వారిద్దరూ కలిసి బయట కనిపించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఎట్టకేలకు ఈ వార్తలకు ఇప్పుడు మంచు, భూమా ఫ్యామిలీలు నేటితో తుది పలికేస్తున్నారు.
ఇంతకు ముందు మంచు మనోజ్‌కు ప్రణతి రెడ్డితో వివాహం అయ్యింది. నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ మనస్పర్దలతో విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రణతి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేసిన విషయం తెలిసిందే. మనోజ్, ప్రణతి మధ్య విభేదాలకు ఇదే ప్రధాన కారణమని వినికిడి. ఆ సమయంలో మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరో వైపు మౌనిక కూడా ఇది వరకు పెళ్లి అయి విడాకులు తీసుకున్నారు. వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారి తీసింది. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం