దర్శకుడు లోకేష్ కనగరాజ్ – హీరో కార్తీ కాంబినేషన్లో వచ్చిన ‘ ఖైదీ’ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన పాటలు, హీరోయిన్, హీరోకి రొమాంటిక్ ట్రాక్ వంటి అంశాలు లేకుండా… దానికి తోడు సినిమా అంతా హీరో ఒకే కాస్ట్యూమ్‌లో కనిపించడం వంటి వినూత్న రీతిలో తెరకెక్కిన ఆ సినిమా అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.
కేవలం తమిళనాడులో మాత్రమే కాదు… తెలుగు రాష్ట్రాల్లోనూ ఖైదీ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్, హీరో కార్తీలకు ఎంతగానో ప్రశంసలు లభించాయి.ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా (Thalapathy 67) రూపొందుతోంది. ఆ సినిమా పూర్తయిన అయిన తర్వాత ‘ఖైదీ 2’ మొదలవుతుందని కార్తీ చెప్పారు. ఈ శుక్రవారం (ఆగస్టు 12న) ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘విరుమాన్’ తమిళంలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో కార్తీ ముచ్చటించారు.
ఆ సందర్భంగా ‘ఖైదీ 2’ గురించి చెప్పారు. ప్రస్తుతం లోకేష్ విజయ్ సార్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను లోకేష్ పూర్తి చేసిన తర్వాత ఖైదీ 2 సినిమా మొదలు పెడతాం అని కార్తీ పేర్కొన్నారు.కమల్ హాసన్ తో ఇటీవలే ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నారు.
ఎన్నో ఏళ్ళకి కమల్ హాసన్ కు కమర్షియల్ విజయాన్ని అందించడమే కాక.. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి మేటి నటులను ఆయన సమర్థవంతంగా నటింపజేసుకున్న తీరుకు ప్రశంసలు అందుకున్నారు.అంతే కాక బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్నారు. పైగా ఆ చిత్రానికి, ‘ఖైదీ’ చిత్రానికి లింక్ ఉంది.
‘విక్రమ్’ సినిమా చివర్లో ‘ఖైదీ 2’ గురించి, అందులో కార్తీ పోషించిన ఢిల్లీ పాత్ర గురించి చిన్న హింట్ కూడా ఇచ్చారు. అంతకు ముందే ‘ఖైదీ 2’ ఉంటుందని చెప్పారు కూడా. అయితే… ‘ఖైదీ 2’ కంటే ముందు విజయ్ ‘మాస్టర్’, ‘విక్రమ్’ చేశారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు విజయ్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు.
ఇక ‘విక్రమ్’లో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించారు. ఆయన తెరపై కనిపించింది కాసేపే అయినా ఆ పాత్ర ప్రేక్షకులను భలే ఆకట్టుకుంది. రోలెక్స్ పాత్రను ఆధారంగా చేసుకుని కూడా ఒక సినిమా ఉంటుందని లోకేష్ ఇదివరకే తెలిపారు. ‘విక్రమ్ 2’లో కూడా సూర్య మెయిన్ విలన్ గా కనిపిస్తారు అని కూడా ఒక టాక్ ఉంది. ఇక ఇవి కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లోకేష్ మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది.
కమల్ హాసన్, సూర్య, కార్తీలతో లోకేష్ కనగరాజ్ హాలీవుడ్ తరహాలో ఒక సినిమాటిక్ యూనివర్స్ తయారు చేసే ఆలోచనలో భాగమే ఈ ఖైదీ2 మరియు విక్రమ్2 సినిమాలు వస్తున్నాయి. అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ తో లోకేష్ చేస్తున్న సినిమా కూడా ఆ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఆ సినిమా విడుదల అయ్యే వరకూ ఆగక తప్పదు.