ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువై పోయాయి.ఎప్పుడు ఏ సెలబ్రిటీ జంట విడాకుల వార్త చెబుతుంది అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండటం లేదు. ఇప్పటికే తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు ప్రకటించగా ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఎవరో కాదు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి సింగర్లు గా పేరు తెచ్చుకున్న హేమ చంద్ర, శ్రావణ భార్గవి.
తెలుగులో హేమచంద్ర తన తండ్రి గాన వారసత్వాన్ని అందిపుచ్చుకుని గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో ఇప్పటికే ఎన్నో పాటలు పాడిన ఆయన తెలుగు సంగీత ప్రపంచంలో ఆయనకు అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం గాయకుడు గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మందికి గాత్రదానం చేసిన ఆయన తన సహ గాయని శ్రావణ భార్గవిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరూ 2013వ సంవత్సరంలో వివాహం చేసుకోగా వీరికి శిఖర చంద్రిక అనే ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప 2016వ సంవత్సరంలో జన్మించింది. అయితే ఈ మధ్య ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలీదు కానీ వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని, మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
అయితే ఆ విషయం పై హేమ చంద్ర,శ్రావణ భార్గవి ఇద్దరూ పరోక్షంగా వివరణ ఇచ్చారు. తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ల ద్వారా వారు పుకార్లు పుట్టించే వాళ్లకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. ఈ మేరకు శ్రావణ భార్గవి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తన యూట్యూబ్ విడియోలకి ఆదరణ మరింత పెరిగిందని,అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్లు పెరిగారు అని,గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్తూ మీడియా చేసిన అసత్యపు ప్రచారాల వల్ల తనకు మంచే జరిగింది అని చెప్పారు.
ఇక హేమచంద్ర కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారానే అనవసరమైన,అక్కర్లేని పుకార్లు లేదా బుద్ధి తక్కువ మనుషులు ప్రచారం చేసే పుకార్లే తన పాటల కన్నా ఎక్కువగా వ్యాపిస్తాయి అని చెప్తూ ఒక కొత్త పాట చేశాను చూడండి అంటూ చమక్కులు విసిరాడు.ఈ దంపతులు ఇచ్చిన వివరణ తరువాత అయినా విడాకుల పుకార్లు ఆగితే అందరికీ మంచిది.