పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ఆలస్యమైన ప్రాజెక్ట్ గా హరి హర వీరమల్లు సినిమా నిలుస్తుంది. కరోనా మహమ్మారి తర్వాత హరి హర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమైనా అది నత్తనడకన సాగింది. ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పలు ఊహాగానాలు వినిపించాయి.
పవన్ కళ్యాణ్ కూడా తన పొలిటికల్ మీటింగులతో బిజీ అయిపోవడంతో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ వరుసగా ఆలస్యమవుతుండటంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు సమాచారం.
ఈ కారణాల వల్ల సినిమా వరుసగా వాయిదా పడటం, పలు రీషూట్ లు కూడా జరగడంతో నిర్మాత పై చాలా భారం పడింది. ఈ సినిమా ఇంకా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకోాల్సి ఉంది. మొదట ఈ సినిమాను సింగిల్ పార్ట్ గా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని, అయితే ఇప్పుడు ఈ సినిమాను రెండు భాగాలుగా విడగొట్టే యోచనలో ఉన్నారని, ఇది సినిమా బడ్జెట్ ను రికవరీ చేయడానికి మరియు మంచి బిజినెస్ చేయడానికి సహాయపడుతుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇది కూడా రిస్క్ తో కూడుకున్నదనే చెప్పాలి. ఎందుకంటే మొదటి భాగం గనక విజయం సాధిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ అలా కాకుండా పరాజయం పాలైతే మాత్రం రెండో భాగాన్ని అమ్మడం నిర్మాతకు మరో భారం అవుతుంది. క్రిష్ గత చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ ఇదే సమస్య ఎదురైంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు చిత్రం మొఘలుల నుంచి కోహినూర్ లాంటి వజ్రాన్ని దొంగిలించే పనిలో ఉన్న రాబిన్ హుడ్ లాంటి వ్యక్తి కథ. నిధి అగర్వాల్, బాబీ డియోల్ నర్గీస్ ఫక్రీ, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.