సమంత రుత్ ప్రభు నటించిన శాకుంతలం చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడిందని, అధికారికంగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కావట్లేదని కొన్ని పుకార్లు వినిపించాయి. ఈ వార్తలు విన్న సమంత అభిమానులు కాస్త ఆందోళన చెందారు.
అంతే కాకుండా శాకుంతలం సినిమా వాయిదా పడటానికి ఆర్థిక కారణాలే కారణమని ఆ పుకార్లు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఖండించారట.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయని, అనుకున్న ప్రకారం ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ఆయన ధృవీకరించారని తెలుస్తోంది.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 3డిలో కూడా విడుదల కానున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు మరియు గుణ టీమ్ వర్క్స్ పతాకం పై నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా, ప్రిన్స్ భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధూ, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు.