సాధారణంగా సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల కాంబినేషన్, అలాగే కొందరు హీరో – దర్శకుల కాంబినేషన్లో సినిమా వస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్ముతూ ఉంటారు. అలాంటి విషయం ఈరోజు మళ్ళీ రుజువైంది. ఇంతకు ముందు రెండు చక్కని విజయాలు అందుకున్న సినిమాలని అందించిన కథానాయక – దర్శకద్వయం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
అచ్చం యెన్‌బడు మడమైయాడ (2016), అంతకు ముందు విన్నైతాండి వరువాయా (2010), ఇలా రెండు సూపర్ హిట్ చిత్రాలు తీసిన శింబు – గౌతమ్ మీనన్ ల కలయికలో 12 సంవత్సరాల తర్వాత వెందు తానింధతు కాడు పార్ట్ 1: ది కిండ్లింగ్ సినిమాకు మళ్లీ కలిసి పని చేశారు. ఈరోజు విడుదలైన వారి సినిమాకి తొలి షోల నుండి మంచి టాక్ వినిపిస్తుంది.
కాగా శింబు – గౌతమ్ మీనన్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అంటే అది మనసును తాకే ప్రేమకథ అయి ఉంటుంది అని ప్రేక్షకులు ఊహిస్తారు. అయితే వీరిద్దరూ మూడోసారి సినిమా చేస్తున్నప్పుడు మాత్రం మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను రూపొందించడం గమనార్హం.
ఇక ట్రైలర్ చూస్తేనే ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని స్పష్టంగా అర్ధం అవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒక గ్రామీణ యువకుడు బతుకుతెరువు కోసం ముంబై రావడం.. అక్కడ అనుకోని పరిస్థితుల్లో మాఫియా గ్యాంగ్ వార్ మధ్య చిక్కుకోవడం వంటి అంశాలతో సాగిన ఈ ప్రయాణాన్ని ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తితో తిలకించారని తెలుస్తోంది.
ముఖ్యంగా శింబు నటన అద్భుతంగా ఉందని అంటున్నారు. అలాగే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు అయిన ఏ ఆర్ రహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉన్నాయి అని అందరూ ముక్తకంఠంతో జై హొ అంటున్నారు. అలాగే లవ్ ట్రాక్ ను హ్యాండిల్ చేయడంలో గౌతమ్ మీనన్ ది అందెవేసిన చేయి. ఈ సినిమాలో కూడా హీరో – హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలను చక్కగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు అని సోషల్ మీడియాలో ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
హీరో శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ మరియు మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో రూపొందిన ‘వెందు తానిందతు కాడు’ చిత్రం తమిళంలో ఈరోజే విడుదల అవగా.. తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో ఎల్లుండి అంటే సెప్టెంబర్ 17న విడుదల కానుంది.
ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో సిద్ధి ఇద్నాని నటించగా . నీరజ్ మాధవ్ మరియు రాధిక శరత్‌కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఇషారి.కె. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై గణేష్ భారీ స్థాయిలో ఈ రెండు భాగాల ఫ్రాంచైజీని నిర్మిస్తున్నారు. కాగా స్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.