ఇండస్ట్రీలో హీరోగా పరిచయమై, విజయాలు లేక విలన్ గా మారిన గోపిచంద్, విలన్ గా చేసింది మూడు సినిమాలలోనే అయినా ఆ పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకునే విధంగా ముద్ర వేశారు. జయం, వర్షం, నిజం లో గోపిచంద్ పోషించిన పాత్రల ప్రభావం అలాంటిది.ఆ తరువాత మళ్ళీ హీరోగా మారి విజయాల బాట పట్టారు. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కాస్త కష్టాల్లో ఉందనే చెప్పాలి.
తాజాగా విడుదలైన గోపీచంద్ సినిమా ‘పక్కా కమర్షియల్’ అటు కంటెంట్,ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా నిరాశ పరచటంతో తరువాత చేయబోయే సినిమాల పై ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ఇక పై కేవలం మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేయాలని, కామెడీ చిత్రాలు తనకి నప్పవని గోపిచంద్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు గోపిచంద్ ఆశలు రాబోయే శ్రీవాస్ సినిమాపైనే ఉన్నాయి. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి హిట్ మళ్ళీ గోపీకి దక్కలేదు. మధ్యలో ‘జిల్, సీటీమార్’ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా మిగిలినవి అన్నీ పరాజయం పాలయ్యాయి.
తాజాగా తమిళ దర్శకుడు హరి తో గోపిచంద్ ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. హరి మాస్ మసాలా డైరెక్టర్. గతంలో హీరో ఎన్టీఆర్ కి హరి ఓ కథను వినిపించారని వార్తలు వచ్చినా, ఆ సినిమా రూపుదాల్చలేదు. ఇప్పుడు ఆ కథనే గోపీచంద్ కి వినిపించారనీ, కథ నచ్చడంతో గోపి ఓకే అన్నారని తెలియవచ్చింది.
తాజాగా విడుదలైన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’తో పాటు హరి దర్శకత్వంలో వచ్చిన ‘ఏనుగు’ కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న శ్రీవాస్ సినిమా తరువాత హరి తో సినిమా మొదలు అవుతుంది అంటున్నారు అయితే గోపీచంద్ కి ఊరట లభించాలి అంటే ముందుగా శ్రీవాస్ తో చేస్తున్న సినిమా హిట్ అవ్వాలి. ఆ తరువాత సక్సెస్ మీద ఉన్న ఊపుతో హరి సినిమా మరింత క్రేజ్ ను మూట గట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గోపిచంద్ – శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లౌక్యం’ చక్కని కామెడీ ఎంటర్ టైనర్ గా అలరించిన నేపథ్యంలో రాబోయే సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి గోపీచంద్ కు కావాల్సిన విజయాన్ని దర్శకుడు శ్రీవాస్ ఇస్తారా లేదా హారి ఇస్తారో చూడాలి.