మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకుంది.
పక్కా కమర్షియల్ చిత్రం ఈ శుక్రవారం అంటే ఆగస్టు 5 నుండి రెండు ఓటిటిల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల నిర్మాతల మండలి సూచనల ప్రకారం ప్రతి మీడియం బడ్జెట్ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం ఆరు వారాల గ్యాప్ తో ఓటిటిలో విడుదల చేస్తారని చెప్పారు. అయితే థియేటర్‌లో విడుదలైన ఐదు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌ల పై బన్ని వాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బీజోయ్ సంగీతం అందించారు.
ఇక గోపించంద్ ఈ చిత్రం తరువాత ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నారు.గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం’ సూపర్ హిట్ కాగా .. ‘లౌక్యం’ సినిమా అయితే గోపిచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ‘పక్కా కమర్షియల్’ పరాజయంతో మారుతి ఖాతాలో వరుసగా రెండు ఫ్లాప్‌లు నమోదు అయ్యాయి. గత దీపావళికి మారుతి దర్శకత్వంలో వచ్చిన “మంచి రోజులు వచ్చాయి” ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మారుతి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో హారర్ కామెడీ చిత్రాన్ని చేయబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుండగా.. ఈ సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. మరి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ చిత్రం గురించి ఒక అంచనాకు రాలేము.
ఇక ’పక్కా కమర్షియల్’ బాక్స్ ఆఫీస్ ఫలితానికి సంబంధించిన వివరాలకు వస్తే.. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్ షోల వరకూ మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ టాక్ అసలు బాగోలేకపోవడం, కంటెంట్ పరంగా కూడా మరీ రొటీన్ అవడంతో సినిమా కలెక్షన్స్ అలా పడిపోతూ వచ్చాయి.