గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ లిస్ట్ (2022)లో తెలుగు సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈ సెర్చ్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉండడం అల్లు అర్జున్ కు ఇది వరుసగా రెండో ఏడాది కావడం విశేషం. కాగా ఈ లిస్ట్ లో 2022లో ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోకపోయినా టాప్ 5 లో ఉన్న హీరో అల్లు అర్జున్ ఒక్కడే కావడం మరో విశేషం. ఆయన చివరి చిత్రం పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ తర్వాత రెండవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. ఆయన తర్వాత ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరుస స్థానాల్లో ఉన్నారు. గత ఏడాది మహేష్ నటించిన సర్కారు వారి పాట విడుదలైంది. ప్రభాస్ రాధేశ్యామ్ 2022 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆదిపురుష్ టీజర్ వల్ల కూడా ప్రభాస్ వార్తల్లో నిలిచారు మరియు సాలార్ సెట్స్ నుండి లీకైన అనేక స్టిల్స్ ప్రేక్షకులలో చాలా ఆసక్తిని కలిగించాయి.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికి భారీ క్రేజ్ మరియు హైప్ ను తెచ్చి పెట్టింది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో ఆర్ సి 15 సినిమాతో బిజీగా ఉండగా, మహేష్, అల్లు అర్జున్ ల మాదిరిగానే ఎన్టీఆర్ కూడా ఇప్పటికైతే షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.
గత ఏడాది ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవిని మినహాయిస్తే ప్రస్తుతం ఉన్న పేర్లే నమోదయ్యాయి. 2022 మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ యాక్టర్స్ జాబితాలో చిరంజీవి స్థానాన్ని ఈసారి రామ్ చరణ్ భర్తీ చేశారు. నిర్దిష్ట కాలంలో ప్రతి నటుడి గురించి జరిగిన సెర్చ్ వాల్యూమ్ ఆధారంగా గూగుల్ సెర్చ్ జాబితా తయారు చేయబడుతుంది.