సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన ఇంట్లో బంగారం చోరీకి గురైందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని తన ఇంట్లో రూ.3.64 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయనీ.. ఆమె ఫిర్యాదులో ఇద్దరు ఇంటి సభ్యులను, ఒక డ్రైవర్ ను అనుమానితులుగా పేర్కొన్నారు.
తన నగలను లాకర్లో భద్రపరిచానని, ఈ విషయం ఇంటిలో పని చేసే సిబ్బందికి తెలుసని తేనాంపేట పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఐశ్వర్య రజినీకాంత్ పేర్కొన్నారు.2019లో తన సోదరి పెళ్లి రోజున చివరిసారిగా తన నగలను ధరించానని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి నగలను లాకర్ లో భద్రపరిచినట్లు దర్శకురాలు వెల్లడించారు.
లాకర్ ను మొదట ఆ సమయంలో ఆమె భర్త ధనుష్ ఇంట్లో ఉంచారు, కానీ తరువాత చెన్నైలోని ఆమె అపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం లాకర్ తన తండ్రి రజినీకాంత్ ఇంట్లో ఉందని ఆమె చెప్పారు. తాళాలు మొత్తం తన వద్దే ఉన్నాయని కూడా ఆమె వెల్లడించారు. దొంగిలించిన వస్తువుల్లో 60 బంగారు నగలు, పురాతన బంగారు నాణేలు ఉన్నట్లు సమాచారం.
వీటితో పాటు డైమండ్ నెక్లెస్ లు, బ్రాస్ లెట్ లు, నవరత్నాల సెట్లు కూడా చోరీకి గురయ్యాయట. బంగారు ఆభరణాల విలువ రూ.3.62 లక్షల వరకు ఉంటుందని, అయితే మొత్తంగా చోరీకి గురైన నగల విలువ చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే ఏడేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ తన దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. కమ్యూనిజం, క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె తండ్రి రజినీకాంత్ ఒక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.