మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఘరానా మొగుడు’ సినిమాను మెగా అభిమానులు అనేక ప్రదేశాలలో ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ షోలకు స్పందన అనుకున్నంత భారీగా లేకపోవడమే.
టాలీవుడ్‌లో ఇటీవల రీ రిలీజ్ ల వర్షం కురుస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని మహేష్ అభిమానులు భారీ స్థాయిలో ప్రత్యేక ప్రదర్శనలను ఒక పండగలా జరుపుకున్నారు. అంతే కాక వారి విశేష స్థాయి సంబరాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఇక మహేష్ అభిమానుల సంబరాలు చూసి పవర్ స్టార్ అభిమానులు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా ఘరానా మొగుడు సినిమాని ప్రదర్శించడానికి పూనుకున్నారు.
అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. అయితే ఇవి పోకిరి లాగా విస్తృత స్థాయిలో అత్యధిక షోలు కాకుండా పరిమితంగానే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, చాలా షోలు అమ్ముడవ్వకపోవడం లేదా హౌస్‌ఫుల్ కావడం కొంత మంది మెగా అభిమానులను నిరుత్సాహపరిచింది.
అయితే ఇక్కడ మెగా అభిమానులు బాధ పడాల్సిన అవసరం లేదు. 1992లో విడుదలైన ఘరానా మొగుడు అప్పట్లో 10 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన తొలి టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా చాలా కేంద్రాలలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. కాబట్టి ఘరానా మొగుడు సినిమా సాధించాల్సిన ఘనత 30 ఏళ్ళ క్రితమే సాధించింది. ఇప్పుడు ఏదో అభిమానులు తమ ఆనందం కోసం వేసుకున్న షోలు హౌజ్ ఫుల్ కాలేదని చింతించాల్సిన అవసరం లేదు.
కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఘరానా మొగుడు సినిమా అన్ని వర్గాల వారిని అలరించేలా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రం మెగా అభిమానులకు ఎంతో ప్రత్యేకం అని చెప్పచ్చు. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో కామెడీ, మాస్ డైలాగ్స్, ఫైట్స్, హీరోయిన్లతో రొమాన్స్ మరియు డాన్స్ ను కనబరిచి ఆకట్టుకున్నారు. అలాగే ఆయనకు ధీటుగా హీరోయిన్ గా నగ్మా కూడా తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఇప్పటికీ ఎందరో మెగా అభిమానులతో పాటు ఇతర సాధారణ ప్రేక్షకులకు కూడా ఘరానా మొగుడు సినిమా అలరిస్తుంది.