దళపతి విజయ్ తో దర్శకుడు వంశీ పైడిపల్లి తన తాజా చిత్రం వారిసును తెరకెక్కించిన విధానం పై అనేక ట్రోల్స్ వచ్చాయి. అయితే అన్ని రకాల ట్రోల్స్, తనపై వచ్చిన రెస్పాన్స్ తో విసిగిపోయిన ఆయన ఓ ఇంటర్వ్యూలో అందరి పై నిప్పులు చెరిగారు.
ఫిల్మ్ మేకింగ్ అనేది జోక్ కాదని, సినిమా యూనిట్ లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేస్తారని, ఎన్నో త్యాగాలు చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తారని వంశీ అన్నారు. తన హీరో విజయ్ సెట్స్ మీదకు వచ్చే ముందు పాటలు, డైలాగుల కోసం రిహార్సల్స్ చేయడాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
వారిసు సినిమాను చూసిన చాలా మంది ప్రేక్షకులు వెండితెర పై టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని తొలి రోజు నుంచీ ట్రోల్ చేస్తున్నారు. దీని పై దర్శకుడు వంశీ ఘాటుగా స్పందించారు.
సీరియల్స్ ను కించపర్చవద్దని ఆయన అన్నారు. అన్ని కుటుంబాలు సీరియల్స్ ను ఇష్టపడతాయి మరియు వాటిని రోజూ చూస్తాయి, సీరియల్స్ తీసే వాళ్ళు కూడా ఒక పరిశ్రమనే అని అన్నారు. ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకోనని, తన పనిని మాత్రమే తాను పట్టించుకుంటానని వంశీ ఈ సందర్భంగా చెప్పారు.
అయితే దర్శకుడిగా విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వంశీకి నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. వంశీ స్పందన చాలా మొరటుగా ఉందని, ఇదే విషయం పై హుందాగా స్పందించిన హెచ్.వినోద్, లోకేష్ కనగరాజ్ వంటి యువ దర్శకులను ఉదాహరణగా చూపిస్తూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.