సూపర్ స్టార్ కృష్ణ నిజంగా భారతీయ సినిమా పరిశ్రమలోని లెజెండ్ లలో ఒకరు. ఆయన వైభవం కేవలం ఆయన నటన వరకే కాదు మొత్తంగా సినిమా రంగానికి కూడా విస్తరించింది. ఆయన అందరూ స్మరించుకోవాల్సిన మరియు స్ఫూర్తి పొందాల్సిన గొప్ప మనిషి. అందుకే, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన కుటుంబం కృష్ణ స్మారక చిహ్నం (memorial) కోసం సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తల ప్రకారం, కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన యొక్క భారీ విగ్రహం, ఆయన సినిమాల జీవిత-పరిమాణ ఫోటోల ప్రదర్శన, వివిధ షీల్డ్‌లు మరియు అవార్డులతో కూడిన స్మారక చిహ్నాన్ని నిర్మించాలని యోచిస్తున్నారట. సందర్శకులు సూపర్ స్టార్ గొప్పతనాన్ని తిలకించేందుకు కొంత సమయం వెచ్చించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్‌లోని పద్మాలయ స్టూడియో సమీపంలో ఈ మెమోరియల్‌ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు హీరోలకు ఇది మొట్ట మొదటిది అని చెప్పచ్చు. ANR విగ్రహం మరియు చిత్రాలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచబడ్డాయి, ఎన్టీఆర్ ఘాట్ ట్యాంక్‌బండ్‌కు సమీపంలో ఉంది, అయితే కృష్ణ గారి స్మారక చిహ్నం నటుడిగా కృష్ణ ప్రయాణం గురించి మరింత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉంటుంది అని తెలుస్తోంది.
నిజానికి ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, ఇది మంచి ఆలోచన అని, త్వరగా అమలు చేయాలని సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కూడా భావిస్తున్నారు.
కృష్ణ గారి అంత్యక్రియలు నిన్న సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి మరియు ఆయన కుటుంబంతో పాటు కోట్లాది మంది అభిమాన గణం తెలుగు సినిమా గొప్ప నటులలో ఒకరికి వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులను వరుసగా కోల్పోవడంతో పూర్తిగా కుప్పకూలిపోయారు.
ఎంతో ఆప్తులైన ఘట్టమనేని కుటుంబ సభ్యుల నష్టం మహేష్ బాబు కు పూడ్చలేనిదే. కృష్ణ గారికి మెమోరియల్ ఏర్పాటు చేస్తే కనీసం తన తండ్రి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆ రకంగా కాస్త సాంత్వన లభిస్తుంది.