లైగర్ సినిమా భారీ పరాజయం పాలవడం ఆ సినిమా యూనిట్ మొత్తానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాధ్ కి చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లు మరియు ఫైనాన్షియర్లు నష్టపరిహారం కోరడం ఆ వ్యవహారం అంతా ఒక వివాదంగా మారడం వంటి అంశాలు ఆయనను మానసికంగా ప్రభావితం చేశాయి.
పూరి జగన్నాధ్ గతంలో కొనుగోలుదారులకు లైగర్ సినిమా వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేస్తానని హామీ ఇచ్చారట. కానీ అసలు సమస్య ఏమిటంటే, అలా మాటిచ్చిన తర్వాత పూరి.. డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుండి ఎవరు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా స్పందించలేదట. పూరి నుంచి అలాంటి స్పందన చూసిన తరువాత, బయ్యర్లు అందరూ కలిసి ఆయన ఇంటి ముందు సమ్మె చేయాలని ప్లాన్ చేశారు.
అయితే ఈ సమ్మెను ఒక బ్లాక్‌మెయిల్‌గా పేర్కొంటూ, వారి పై పోలీసు కేసు నమోదు చేయాలని పూరి నిర్ణయించుకున్నారు. ఇటీవలే కేసు నమోదు కూడా చేశారు. తనకి తన కుటుంబానికి వరంగల్ శ్రీను మరియు జి శోబన్ బాబు మరియు ఇతర పంపిణీదారులు నుండి రక్షణ కల్పించవల్సిందిగా పోలీసు వారిని పూరి అభ్యర్థించిన విషయం తెలిసిందే.
తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇలా తమ మీదే ఆరోపణలు చేయడంతో.. భవిష్యత్తులో పూరి తరపు నుంచి వచ్చే ఏ సినిమాకి కూడా ఫైనాన్స్ చేయకూడదని ఫైనాన్షియర్లు నిర్ణయించుకున్నారని సమాచారం. పూరికి కష్టకాలంలో తాము సహాయం చేశామని ఫైనాన్షియర్‌లు అంటున్నారు.
కానీ ఇప్పుడు పూరి నష్టాల నుండి తప్పించుకోవడానికి తను ప్రణాళికలు రచిస్తూ తిరిగి తమను నిందిస్తున్నాడని చెప్తూ.. పూరిని ఒక మోసగాడిగా అభివర్ణించారు. ఏదేమైనా పూరి ఇలాంటి వివాదాలు అన్నిటికీ దూరంగా జరిగి ఒక బ్లాక్ బస్టర్ విజయంతో మరోసారి తన సత్తా ఏంటో అందరికీ చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ సైతం ‘లైగర్’ ప్లాప్ నుంచి బయటకు వచ్చి తదుపరి చేయాల్సిన సినిమాల పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోసారి పూరి ఇలాంటి వివాదాలతో కాకుండా మంచి సినిమా ఓకే అయింది అన్న వార్త బయటకి రావాలని ఆశిద్దాం.