ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రాల్లో ఎన్టీఆర్ 30 ఒకటి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రెండవ సినిమాగా, మరియు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పలుమార్లు వాయిదా పడటం అభిమానులను, ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.
ఏదేమైనా ఇన్ని వాయిదాల తర్వాత ఎన్టీఆర్ 30 షూటింగ్ డేట్ ఎట్టకేలకు ఖరారు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందిన వార్తల ప్రకారం మార్చి 23న ఎన్టీఆర్ 30 యొక్క పూజా కార్యక్రమాలు జరిపి మార్చి 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట.
ఇటీవల జాహ్నవి కపూర్ 26వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 చిత్ర నిర్మాతలు ఆమెను ఈ చిత్ర హీరోయిన్ గా అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే తన కోరికను జాహ్నవి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ జోడీని తొలిసారి తెరపై చూడటం ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుంది.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు రావడం పట్ల ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆస్కార్ అవార్డుల అనంతరం ఓ హాలీవుడ్ మీడియా పోర్టల్ తో మాట్లాడిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ 30 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా పెద్ద స్థాయిలోనే ఉంటుంది ఆ సినిమా కూడా ఆర్ఆర్ఆర్ క్వాలిటీకి సరిపోతుందని ఆశిస్తున్నా. ఈ నెలలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది” అని ఎన్టీఆర్ అన్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత హరికృష్ణ కె, యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ ఆర్ట్ డిపార్ట్ మెంట్ లను చూసుకుంటున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్.