పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల షూటింగ్ షెడ్యూల్‌లతో ఒకరకంగా ఆటాడుకుంటున్నారు. అందుకు కారణం ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు రాజకీయాలలో కూడా ఆక్టివ్ గా ఉండటమే. సమాజం పట్ల ఉన్న బాధ్యతతో ఆయన రాజకీయాల లోకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినా తన పోరాటాన్ని ఆయన ఆపలేదు.
ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ రీమేక్, హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. క్రిష్ కాంబినేషన్లో వస్తున్న హరి హర వీర మల్లు సినిమా మాత్రం సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది.
ఇటీవలే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయనున్నారు అనే వార్త తెలియగానే నిర్మాతలకు మరో షాక్ తగిలింది. దసరా నుండి యాత్ర ప్రారంభం అవుతుందని, ఆ యాత్రలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకుంటారని ముందుగా సమాచారం అందింది.
దీంతో షూటింగ్‌లకు తక్కువ సమయం మిగిలి తద్వారా నిర్మాతలు కాస్త ఆందోళన పడే పరిస్థితి ఏర్పడింది.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్ర వాయిదా వేయనున్నారని తెలియడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాత్ర వచ్చే ఏడాది ప్రారంభం కావచ్చు అంటున్నారు. ఈలోపు పవర్ స్టార్ తన సినిమాల తాలూకు షూటింగ్ పనులను తొందరగా పూర్తి చేస్తారని నిర్మాతలు భావిస్తున్నారు.
ఇప్పటికే హర హర వీర మల్లు సినిమా చాలా ఆలస్యం అయింది. చిత్ర బృందం రిలీజ్ డేట్ ని పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది వేసవికి విడుదల కావాల్సి ఉండగా, ఆ తేదీ నుంచి దసరా 2022కి ఆపై సంక్రాంతికి 2023కి వాయిదా పడి ఇప్పుడు తాజాగా సంక్రాంతి నుంచి 2023 సమ్మర్‌కి వాయిదా పడింది.
ఇక పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వేసిన నేపథ్యంలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం 50 రోజుల కాల్షీట్లు ఇచ్చారట. మరి క్రిష్, చిత్ర బృందం ఆ డేట్లని ఉపయోగించుకుని కనీసం ఈ సారైనా చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేస్తారా లేక మళ్ళీ వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.