2023 సంక్రాంతి టాలీవుడ్ అభిమానులకు కన్నుల పండుగలా ఉండబోతుంది. ఈసారి తెలుగు, తమిళ అగ్ర తారలు నటించిన నాలుగు పెద్ద కమర్షియల్ ఎంటర్ టైనర్ లు పండుగ సీజన్ లో విజయం సాధించడానికి పోటీ పడుతున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు తరువాతి తేదీలకు వాయిదా పడటంతో 2022 సంక్రాంతి తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ, సంక్రాంతి 2023 ఖచ్చితంగా సినిమా ప్రేమికులకు పండుగ అనుభూతిని మళ్ళీ తీసుకు వచ్చేలా ఉంది.
మొదట, అజిత్ కుమార్ యొక్క తెగింపు జనవరి 11 న థియేటర్లలో విడుదల కానుంది, విజయ్ యొక్క వారసుడు కూడా అదే తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ రోజు దాని కొత్త విడుదల తేదీని జనవరి 14 గా ప్రకటించారు. ఆ రకంగా హీరో అజిత్ తెలుగు రాష్ట్రాల్లో సోలో రిలీజ్ ను ఎంజాయ్ చేస్తారన్నమాట.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు.
మరుసటి రోజు అంటే జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాస్ మహారాజా రవితేజ ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ టాప్ స్టార్ మూవీస్ తో పాటు యంగ్ హీరో సంతోష్ శోభన్ కూడా కళ్యాణం కమనియం సినిమాతో రంగంలోకి దిగారు. సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో దేవి ప్రసాద్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి, సద్దాం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.