ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హనుమాన్, ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ తాజాగా విడుదలైంది. కాగా విడుదలయిన అప్పటి నుండి ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఏదో చిన్న సినిమా అని అందరూ భావించగా.. టీజర్ లోని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే, ఎంకి పెళ్ళి సుబ్బి గాడి చావుకు వచ్చినట్టు హనుమాన్ టీజర్ తర్వాత ఆదిపురుష్ సినిమా పై విమర్శలు కూడా అదే స్థాయిలో మళ్ళీ తెర పైకి వచ్చాయి. హనుమాన్ టీజర్ చూసిన వారంతా ఆదిపురుష్ టీజర్ ను గుర్తు చేసుకుంటున్నారు.
ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా హనుమాన్ తో పోలిస్తే ఆదిపురుష్ టీజర్ నాణ్యత చాలా తక్కువగా ఉందని, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఒక పెద్ద సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవని ఫిర్యాదు చేస్తున్నారు. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తీసుకున్నప్పటికీ తక్కువ క్వాలిటీ చూపించడం వల్ల విమర్శలు పొందుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫన్నీ మీమ్స్ మరియు ట్వీట్లు వైరల్ అయ్యాయి.
ఇక తక్కువ బడ్జెట్‌తోనే ప్రశాంత్ వర్మ మెరుగైన నాణ్యతను సాధించగలిగారని ఆయన పై ప్రేక్షకులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఓం రౌత్ అసమర్థుడని, ప్రశాంత్ నుంచి తనను నేర్చుకోమని సలహా ఇస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న హనుమాన్ చిత్రంలో తేజ సజ్జ ప్రధాన నటుడు కాగా, అమృత అయ్యర్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, టీజర్‌లో ఆమె పాత్రకు సంబంధించిన సంగ్రహావలోకనం ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో వరలక్ష్మికి మరో పవర్ ఫుల్ రోల్ దొరికినట్లు కనిపిస్తోంది.
సినిమా నిర్మాణంలో డబ్బు మాత్రమే ప్రధానం కాదు అనడానికి హనుమాన్ టీజర్ నిదర్శనంగా నిలిచింది. క్రియేటివిటీ, ప్లానింగ్‌తో పాటు చక్కని విజన్ ఉంటే చిన్న బడ్జెట్‌తో కూడా మంచి సినిమాలు తీయవచ్చు అని ఈ టీజర్ నిరూపించింది. టాలీవుడ్‌లో ఈ మధ్య తక్కువ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మంచి క్వాలిటీని సాధించడం విశేషం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలే ఎక్కువ వస్తే అది తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతగానో మేలు చేస్తుంది.