Home సినిమా వార్తలు Editor Gowtham Raju Passed away: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత

Editor Gowtham Raju Passed away: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్‌ గౌతంరాజు (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతంరాజు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.గౌతంరాజు తెలుగులో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.

గౌతంరాజు దాదాపుగా 850 సినిమాల వరకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేసి తనదైన పనితనం చూపించేవారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలైన చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ రేసుగుర్రం, బలుపు, బద్రీనాథ్, డాన్ శీను, వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన పనిచేశారు.

1982లో నాలుగు స్తంభాలాట చిత్రంతో ఎడిటర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతంరాజు, నలభై ఏళ్లుగా ఎన్నో సినిమాలకు పని చేయడమే కాక వాటి విజయాలలో కీలక పాత్ర పోషించారు.1954 జనవరి 15న ఏపీలోని ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు గౌతంరాజు. ప్రముఖ తెలుగు దర్శకుడు జంధ్యాల తొలి చిత్రమైన నాలుగు స్తంభాలాట చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించారు గౌతంరాజు.

దళపతి, అసెంబ్లీ రౌడీ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయన ఎడిటింగ్ చేశారు. చివరగా ఆయన మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్ ఆఫ్ ఇండియాకు ఎడిటర్‌గా చేశారు. తన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డ్‌లను, రివార్డ్‌లను అందుకున్న ఎడిటర్ గౌతంరాజుకు సంధ్య, సుమాంజలి అనే ఇద్దరు పిల్లలున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి ఇవాళ ఉదయం ఇంకాస్త క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయినట్లు తెలుస్తుంది.గౌతంరాజు శ్వాస సంబంధ సమస్యలతో మరణించారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.గౌతం రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ, గౌతం రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version