లైగర్ సినిమా బహుశా ఆ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక పీడకలగా ఉంటుందేమో. ఎందుకంటే ఇంకా ఆ సినిమాకి సంభందించిన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ హైప్ తో వచ్చిన లైగర్ సినిమా అనూహ్యంగా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమా నష్టాల్లో ఎవరి భాగం ఎంత అనే దాని మీద చాలానే పుకార్లు వచ్చాయి.
పూరీ జగన్నాథ్ నష్టాలకు భాధ్యత వహించే విదంగా నడుచుకొలేదని, బయ్యర్లు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం.. ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని బెదిరించడం వంటి సంఘటనలు జరిగాయి. ఆ పైన వారు వ్యవహరించిన తీరు పై పూరీ కూడా మండి పడి వారి మీద పోలీసు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇవన్నీ చాలవు అన్నట్టు తాజాగా ఆర్థిక నేరాలను పరిశోధించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లైగర్ టీమ్ పై దృష్టి సారించినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీలను ఈరోజు ఉదయం నుంచి విచారిస్తున్నారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌లో రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టారని ప్రొడక్షన్ హౌస్ మీద ఉన్న ఆరోపణల పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. 15 రోజుల క్రితం పూరీ జగన్నాథ్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. అయితే ఇప్పటికీ గణనీయంగా ఏమీ బయటపడనప్పటికీ, స్పష్టమైన వివరాలను తెలుసుకోవడానికి మరో కొన్ని నెలలు పట్టవచ్చు అని అంటున్నారు.
ఇంతకు ముందే చెప్పుకున్నట్లు, లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచి.. చేసిన వ్యాపారంలో 30% కూడా వసూలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇన్ని వివాదాల మధ్య ఇప్పుడు పూరీ జగన్నాథ్‌కి ఈ ఈడీ నోటీసుల వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా సమస్యల నుంచి ఆయన బయటపడి పని పై దృష్టి పెట్టాలని మరియు కోల్పోయిన తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని ఆశిద్దాం.
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్ సినిమా ఎనౌన్స్ అయినప్పటి నుంచి సినీ ప్రేక్షకులకు క్రేజీ టాపిక్‌గా మారింది. ఈ సినిమా పోస్టర్లు, ప్రోమోలు, సినిమా బాక్సాఫీస్ సత్తా గురించి విజయ్ దేవరకొండ, ఛార్మీ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ అన్నీ సినిమా రిలీజ్ తర్వాత డిజాస్టర్ అయ్యాక నవ్వుల పాలయ్యాయి.
విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా విషయంలో ఇంకా గందరగోళంలో ఉండగా, పూరీ జగన్నాథ్‌కి కూడా తన తదుపరి సినిమాకి అవకాశం రాలేదు. ఆయన మరోసారి తన కుమారుడు ఆకాష్ పూరిని ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కించనున్నారని కొన్ని వార్తలు వచ్చాయి కానీ అది కుదరలేదు.