దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘సీతారామం’. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుని అటు విమర్శకుల ప్రశంసలు, ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని కలెక్షన్లు రాబడుతోంది.
దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దుల్కర్ ఇది వరకే తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇక సీతా రామంతో మరో చక్కని సినిమాను తన ఖాతాలో జమ చేసుకున్నారు.
హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఒక దృశ్య కావ్యంలా మలచబడింది. నటీనటుల ప్రతిభతో పాటు అహ్లాదకరమైన విజువల్స్, వీనుల విందైన సంగీతం తోడై ఈ సినిమాని క్లాసిక్ స్థాయిలో నిలబెట్టాయి.’ యుద్ధంతో రాసిన ప్రేమకథ` అని ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అగ్ర నిర్మాత నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ నటి/మోడల్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం కాగా.. కీలక పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే మంచి టాక్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
ప్రతి షోకి ప్రతి రోజుకూ కలెక్షన్ల పరంగా ఎదుగుదలను కొనసాగిస్తూ విజయపథంలో దూసుకు పోతున్న ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. క్లాస్ సినిమాలకు పెద్ద పీట వేసే US బాక్స్ ఆఫీస్ వద్ద హాఫ్ మిలియన్ డాలర్ల ($500k) మార్కును దాటింది. ఈ చిత్రంతో పాటు రిలీజ్ అయిన బింబిసార కంటే యూఎస్ లో అధికంగా వసూళ్లు కొల్లగొట్టింది సీతా రామం. నాని నటించిన అంటే సుందరానికీ.చిత్రం తరువాత ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.