దర్శకుడు వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 2, కమర్షియల్ సినిమాలను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పారు. కమర్షియల్ సినిమా అయినా, మరేదైనా ఒకరి పనిని కించపరచడం లేదా తక్కువ చేసి మాట్లాడటం తనకు ఎప్పుడూ ఇష్టం ఉండదని వివేక్ ఆత్రేయ అన్నారు. ఇంటర్వ్యూలో చెప్పబడిన మాటలకి అనుగుణంగానే తాను స్పందించానని ఆయన అన్నారు.
నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా అనే దర్శకులతో ఓ యూట్యూబ్ ఛానల్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. కాగా ఈ ఇంటర్వ్యూలో ‘C/O కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా గురించి, అందులో యష్ పోషించిన రాకీ క్యారెక్టర్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా రాకీ భాయ్ క్యారెక్టర్ ను నీచ్ కమిన్ కుత్తె అనడం పెద్ద దుమారం రేపింది. సినిమాలో చనిపోయే ముందు ధనవంతుడిగా మారాలని హీరోని తల్లి కోరడం.. అందుకు కేజీఎఫ్ లోని ప్రజల సహకారంతో హీరో బంగారం సంపాదించి, దానికి ప్రతిఫలంగా వారికి ఏమీ ఇవ్వకుండా మొత్తం తన దగ్గరే ఉంచుకోవటం తనకు హాస్యాస్పదంగా అనిపించిందని ఈ దర్శకుడు/నటుడు అన్నారు. ఇలా రకరకాలుగా కేజీఎఫ్ 2ను ఎగతాళి చేస్తూ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా ఇస్తున్న మిమిక్ ఎక్స్ ప్రెషన్స్ చూసి వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహన కృష్ణ, నందిని రెడ్డి నవ్వారు.
అయితే మహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్విటరాటీ రెచ్చిపోయింది. ముందుగా తోటి దర్శకుడిని గౌరవించాలని, ఒకరి విజయం పై దుమ్మెత్తిపోయకుండా కనీస ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలని పలువురు సోషల్ మీడియా యూజర్లు, నెటిజన్లు వెంకటేష్ మహాని తీవ్రంగా విమర్శించారు.
ఇదిలా ఉంటే ఈ వివాదం పై మొదట స్పందించిన నందిని రెడ్డి తన ప్రవర్తన ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరారు. కేజీఎఫ్ 2ను తక్కువ చేసి చూపించే ఉద్దేశం తమకు లేదని, కమర్షియల్ సినిమా కథనాన్ని వైవిధ్యపరచడం ఎలా ఆమె దాని పై పాజిటివ్ డిబేట్ చేయాలనే ఆలోచన తోనే మాట్లాడమని ఆమె తెలిపారు.