ఒక సినిమా విజయాన్ని అందులో ఉన్న కంటెంట్ మాత్రమే నిర్ణయించే రోజులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంటెంట్‌తో పాటు, ఆ సినిమాని ఎలా ప్రచారం చేశారు? సోషల్ మీడియాలో ఆ చిత్రానికి సంబంధించిన వారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు లేదా గతంలో చేసి ఉన్నారు వంటి అంశాలు కూడా సినిమా కలెక్షన్‌ల పై ప్రభావం చూపుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ వారం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా పరాజయం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమీర్ ఖాన్ చిత్రం విడుదలకు కొన్ని వారాల ముందు నుంచి సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. అందుకు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణం.
ఇక తెలుగు సినిమా పరిశ్రమకు కూడా అలాంటి ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఈ మధ్యనే అనుభవం లోకి వచ్చింది. ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ, మాచర్ల నియోజకవర్గం అనే రెండు సినిమాలకు అలాంటి అనుభవం ఎదురయింది.
రామారావు ఆన్ డ్యూటీ దర్శకుడు శరత్ మండవ.. ట్విట్టర్ రివ్యూలను నమ్మడం గురించీ, మరియు సినిమా చూస్తూ లైవ్ లో వ్యాఖ్యానించేప్రేక్షకులపై వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ ప్రభావం వల్ల చిత్రం విడుదలకు ముందే నెగటివ్ టాక్ దిశగా పయనించింది. ఆ సినిమాలో సరైన సరుకు లేనందువల్లనే సినిమా ఫ్లాప్ అయిన మాట వాస్తవమే అయినప్పటికీ.. దర్శకుడి అనవసర వ్యాఖ్యల ప్రభావం సినిమాపై ఖచ్చితంగా ఉండిందని ఒక వాదన బలంగా వినిపిస్తుంది.
నిన్న విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమాకి కూడా అదే విధంగా జరిగింది. ఆ చిత్ర దర్శకుడు M.S రాజశేఖర్ రెడ్డి, గతంలో చేసిన ట్వీట్‌లను లక్ష్యంగా చేసుకుని.. ఆయన లోగడ చేసిన కుల వ్యతిరేక వ్యాఖ్యలను విస్తృత ప్రచారం చేసి ఆయా ట్వీట్లను కొందరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఆ వ్యవహారం వల్ల వైసీపీఎతర అభిమానుల్లో మాచర్ల నియోజకవర్గం సినిమా పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ ట్వీట్లు తనవి కావని ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదు చేసినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.
ఈ రెండు సంఘటనలు సినిమా ఇండస్ట్రీ వర్గాలకి ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. ఎప్పుడైనా సరే పబ్లిక్ లో మాట్లాడేటపుడు లేదా ఫలానా విషయం మీద ఏమైనా స్టేట్‌మెంట్ లను ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎందుకంటే ఏ సమయంలో ఏ విషయాన్ని బయటకు తీసి అవి వివాదానికి కారణం అవుతాయి అనేది తెలియదు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవకుండా తెలుగు సినీ పరిశ్రమ సభ్యులు అందరూ జాగర్త పాటిస్తారని ఆశిద్దాం.