RRR సినిమా యొక్క ఆస్కార్ ప్రమోషన్స్ విషయంలో ఇటీవల సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన వీడియో పై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. దీని పై నాగబాబుతో పాటు కే రాఘవేంద్ర రావు గారు కూడా స్పందించారు.అయితే తాజాగా ఈ వివాదం పై మళ్ళీ స్పందించిన తమ్మారెడ్డి నాగబాబుని మాటలతో ఏకి పారేశారు.
RRR సినిమా ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని, అదే డబ్బుతో 8-10 సినిమాలు తీయవచ్చని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇటీవలే వైరల్ అయ్యింది. దీని పై నెటిజన్స్ ఏమాత్రం ఏకీభవించకుండా ఆయన పై ద్వజమెత్తారు.
అయితే పరిశ్రమలో సీనియర్ సభ్యుడు అయిన తమ్మారెడ్డి పై సినీ పెద్దలు రాఘవేంద్రరావు, మెగా బ్రదర్ నాగబాబు విరుచుకు పడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే నీయమ్మా మొగుడు ఖర్చు పెట్టాడా రూ.80 కోట్లు అంటూ ఘాటు పదజాలంతో ట్వీట్ చేశారు. తర్వాత రాజమౌళిని చూసి జెలసీ ఫీల్ అవుతున్నావా అంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీని పై తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు.
నిన్న, మొన్న సోషల్ మీడియాలో RRR విషయం పై తమ్మారెడ్డి ఎవరు అనేది తెగ వైరల్ అయ్యింది. అసలు వీడికేం లెక్కలు తెలుసు అని అంటున్నారు. మనం ఏం మాట్లాడినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు. దాన్ని నేను పట్టించుకోను. నేను సినీ ఇండస్ట్రీకి ఎప్పుడూ రెస్పాన్సిబుల్‌గానే ఉంటాను. కాబట్టి దానికి నేను సమాధానం చెప్పాలని అనుకున్నాను. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది పెద్దవాళ్లు దీని పై ట్వీట్ చేయటం చూసి వివరణ ఇవ్వకూడదు అనిపించింది. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. కాబట్టి నేనేం క్షమాపణలు చెప్పను అని ఆయన అన్నారు.
కాగా ఆరోజు మూడు గంటల పాటు సెమినార్‌లో మాట్లాడాం అని తమ్మారెడ్డి తెలిపారు. ఆ చర్చలో భాగంగా ఎక్కువగా చిన్న సినిమాలు గురించి మాట్లాడామని.. దానికి సంబంధించి చిన్న సినిమాలు తీసేవాళ్లందరూ వచ్చారని కూడా చెప్పారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారట. వారితో మాట్లాడుతూ మీరు తీసే సినిమాలు రిలీజ్ కావు. వాటికి థియేటర్స్ దొరకవు. అవార్డులు రావు. ఒక వేళ ఫెస్టివల్స్‌కి ఎలా వెళ్లాలి, ఏం చేయాలనే డిస్కషన్ జరుగుతుంది. ఆ సందర్బంగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాం. RRR, KGF 2 వంటి సినిమాలను చూస్తాం. కానీ తీయాలంటే అంత సులభం కాదు అని వివరించానని ఆయన అన్నారు.. అదే సమయంలో ఎలాంటి తేడాలు వచ్చే అవకాశం ఉందో కూడా వివరించానని అన్నారు.
RRR గురించి అంతకు రెండు రోజుల ముందే భారతదేశానికే గర్వకారణం, రాజమౌళి గారికి హ్యాట్సాఫ్ అని చెప్పాను. అదెవరు చూశారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి తలమానికమైనోళ్లు, చాలా పెద్దవాళ్లు కొందరు ట్వీట్ చేశారు. నీకు లెక్కలు తెలుసా! అని మాట్లాడారు. రాజమౌళిని చూసి నేను అసూయ పడుతున్నానని అన్నారు. అసలు నేను ఆయన్ని చూసి జెలసీ ఫీల్ అవటానికి నేను ఆయన కాలానికి చెందిన దర్శకుడినైనా అయ్యుండాలి లేదా.. ఆయనతో సమానంగా సినిమాలు తీసేవాడినైనా అయ్యుండాలి. నాకెందుకు జెలసీ. నేనేదో కృష్ణా, రామా అని బ్రతుకుతున్నాను. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
నాకు లెక్కలు తెలుసా! అన్నారు. నాకేం లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది లెక్కలు నాకు తెలుసు. ఎవడెవడు ఎవడెవడ్ని ఏ అవార్డుల కోసం ఏం అడుక్కున్నారో, ఏ పదవుల కోసం ఏం అడుక్కున్నారో, ఎవడెవడి కాళ్లు పట్టారో అన్నీ నాకు తెలుసు. ఇవన్నీ మాట్లాడి ఇండస్ట్రీ పరువు రోడ్డు మీద వేయటం నాకు తెలుసు. కానీ నేనెప్పుడూ ఆ పని చేయలేదు. కానీ ఆ పని ఎప్పుడూ చేయలేదు. ఇండస్ట్రీ నా తల్లి.. ఇండస్ట్రీని గౌరవిస్తాను కాబట్టి నేను ఎప్పుడూ ఏదీ మాట్లాడను. ఈరోజుకి నేను సంయమనంగానే మాట్లాడుతుంటే ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు తమ్మారెడ్డి భరద్వాజ.