ఎంతో మంది హీరోలను స్టార్స్ ని చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడం బాధాకరం అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చినచోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.ఈ వేడుకకు పరశురామ్, బండ్ల గణేశ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.వేడుకలో పాల్గొన్న బండ్ల గణేష్ మాట్లాడుతూ, పూరీ సతీమణి లావణ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి. మా వదినమ్మ కోసమే ఈ వేడుకకు వచ్చాను. పూరీ ఎంతో మందిని స్టార్స్ చేశాడు.. కానీ కొడుకు సినిమా ఫంక్షన్ కి మాత్రం రాకుండా ఎక్కడో ముంబయిలో ఉన్నాడు,ఇదేం బాలేదు, ఇలా చేయకూడదు అన్నా అని పూరీని ఉద్దేశించి అన్నారు.
ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుంటే నా కొడుకు కోసం అన్ని పనులు మానుకుని మరీ వచ్చేవాడిని, అన్నా ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా,ఎందుకంటే మనం ఏం సంపాదించినా మన భార్యా పిల్లల కోసమే,వాళ్లను చచ్చేదాకా వదలకూడదు. నాలాంటి వాడిని స్టార్ ప్రొడ్యూసర్ ని చేసి నీ కొడుకుని స్టార్ ని చేయకుండా ముంబయిలో ఉంటే మేం ఒప్పుకోం. చోర్ బజార్ లో నీ కొడుకు అదరగొట్టేశాడు,నువ్వు ఆకాశ్ ని స్టార్ ని చేసినా చేయకున్నా స్టార్ అవుతాడు నీ కొడుకు డేట్స్ కోసం నువ్వు క్యూలో నిలబడే రోజు తప్పకుండా వస్తుంది అని బండ్ల గణేశ్ మాట్లాడారు. అప్పుడు మాత్రం మీ నాన్నకి డేట్స్ ఇవ్వకూడదు అంటూ ఆకాష్ తో బండ్ల గణేష్ అనడం కూడా జరిగింది.
ఇలా ఒక సినిమాకి సంబందించిన వేడుకలో ఇలా పర్సనల్ విషయాల గురించి చర్చించడం అంత మంచిది కాదు. బండ్ల గణేష్ ప్రవర్తన గురించి ఇండస్ట్రీ లో అందరికీ తెలుసు. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాడు,ఒకసారి మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్టు మాట్లాడతాడు అడ్డూ అదుపూ లేకుండా. చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుక జరిగిన తరువాత నుండి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై పలు రకాల చర్చలు జరిగాయి.
అయితే ఈ విషయం పై పూరీ జగన్నాథ్ పరోక్షంగా బదులు ఇచ్చారు. తను యే విషయంపై మాట్లాడాలి అనుకున్నా “పూరీ మ్యూజింగ్స్” ద్వారా తెలిపే అలవాటు ఉన్న పూరీ,అదే తరహాలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మనుషులు నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదని, తమ కుటుంబ సభ్యుల దగ్గరైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఆచి తూచి మాట్లాడితే మంచిదని పూరీ చెప్పారు. మనం ఎలా బతుకుతామో చస్తామో అనేది మన నాలుక పైనే ఆధార పడుతుంది అని ఆయన చెప్పడం గమనార్హం. ఏదేమైనా ఇలాంటి పరస్పర వాదనలు వ్యక్తిగత విషయాలలో జరగడం ఏమాత్రం సరి కాదనే చెప్పాలి. మరి పూరీ ఇచ్చిన ఘాటు స్పందనకి బండ్ల గణేష్ తిరిగి స్పందిస్తాడా లేక ఈ వివాదం ఇంతటితో సమసిపోతుందా చూడాలి.