బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో 1997లో విడుదలైన చిత్రం సింధూరం. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పాత సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ తన పాత సినిమా ‘సింధూరం’ని రీ రిలీజ్ చేయమని దర్శకుడు కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ కు కృష్ణవంశీ స్పందిస్తూ వామ్మో ఆ సినిమా కోసం ఐదేళ్ల పాటు అప్పులు తీర్చేశానని అన్నారు. సింధూరం రీ రిలీజ్ పై కృష్ణవంశీ ఇచ్చిన ఈ రెస్పాన్స్ నెటిజన్లను షాక్ కి గురి చేసింది. ఇంత మంచి సినిమా హిట్ కాకపోవడం ఏమిటని వారు ఆశ్చర్యపోయారు. కృష్ణవంశీ మళ్లీ సింధూరం విడుదల చేస్తే టిక్కెట్లు కొనుక్కుని తిరిగి చెల్లిస్తామని కొందరు నెటిజన్లు ఆయనకి ప్రోత్సాహకంగా నిలిచారు.
దర్శకుడు కృష్ణవంశీ తన పాత ఇంటర్వ్యూలలో సింధూరం సినిమా గురించి చాలా సార్లు గొప్పగా చెప్పారు. తుపాకీ తీసుకుని ప్రజలను చంపితే ఏం జరుగుతుందో చూపించడానికే ఈ సినిమా తీశానని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఆ సినిమాలోని 20 నిమిషాల సీక్వెన్స్ (సెకండాఫ్ లో) ను కాస్త మార్చితే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇండస్ట్రీలోని పెద్దలందరూ ఆయనకు సలహా ఇచ్చారు. అయితే కృష్ణవంశీ ఆ సినిమా ఒక ఉద్దేశ్యం, నిబద్ధతతో చేసినందున, ఆయన వారి సలహాను పట్టించుకోలేదు.
సింధూరం కథ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి శిక్షణ తీసుకుంటూ ఉంటాడు బుల్లిరాజు( బ్రహ్మాజీ). అతను ఉడుకు స్వభావం మరియు న్యాయం యొక్క బలమైన భావాన్ని కలిగి ఉన్న వాడు. బుల్లిరాజు గోదావరి నదికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. బుల్లిరాజు మేనకోడలు బేబీ (సంఘవి) అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అతనికి కూడా ఆమె పై అదే ఇష్టం ఉన్నా.. పైకి మాత్రం ఆ ఇష్టాన్ని చూపించడు.
చంటి (రవితేజ), బైరాగి, సత్తిపండు తదితరులు అదే గ్రామంలో నివసించే దారితప్పిన యువకులుగా ఉంటారు. వారు పేకాట ఆడటం, తాగడం మరియు బాలికలను ఎగతాళి చేయడం వంటివి చేస్తూ సమయాన్ని గడుపుతారు. వీరందరూ బుల్లిరాజుకు స్నేహితులు. కొన్ని సంఘటనల వల్ల బుల్లిరాజును జీవిత మార్గాన్ని మార్చుకోవాల్సి వస్తుంది మరియు చంటి కూడా అతనితో చేరతాడు. చివరికి వారికి ఏమైంది అనేది మిగిలిన కథ.
సింధూరం సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నటీనటులకు, దర్శకుడు కృష్ణవంశీకి ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా రవితేజ కెరీర్లో ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.
అప్పట్లో రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగంతో పాటే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడ్డారు. అయితే ‘సింధూరం’లోని చంటి పాత్రతో రవితేజకి తన నటనా సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశం లభించింది. రవితేజకు 29 ఏళ్లు ఉన్నప్పుడు చంటి పాత్ర లభించింది. ఆ పాత్రలో ఆయన కనబర్చిన అద్భుత నటన ఆయనకు స్టార్ డమ్ తీసుకువచ్చింది.